
నయన్ ఫ్యూచర్ ప్లాన్ ఏమిటో?
నయనతార ఈ పేరు ఇప్పుడు దక్షిణాదిలో ఒక క్రేజ్. దర్శక నిర్మాతలకు ముఖ్యంగా నవతరం దర్శకులకు ఆశాజ్యోతి. ఇక నిర్మాత గల్లాపెట్టెలు నింపే లక్ష్మీదేవి అని కూడా చెప్పొచ్చు. ఇటీవల ఆమె నటించిన డోరా చిత్రం నిజానికి ఏమంత వైవిధ్యం ఉన్న కథా చిత్రం కానేకాదు. ఇంకా చెప్పాలంటే నయనతార నటించాల్సిన చిత్రం కూడా కాదని సినీ విమర్శకుల భావన. అయినా ఆ చిత్రం నిర్మాతకు, బయ్యర్లకు కాసుల వర్షం కురిపించింది. అందుకు కారణం కేవలం నయనతారకున్న క్రేజేనని చెప్పకతప్పదు. ఈ కథ అలా ఉంచితే ఈ టాప్ నాయకి నటిస్తున్న తాజా చిత్రాల్లో అరమ్ చిత్రం ఒకటి.
షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. నవ దర్శకుడు మింజూర్ గోపి మెగాఫోన్ పట్టిన ఈ చిత్రంపైనా మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ సందర్భంగా అరమ్ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇందులో నయనతార జిల్లా కలెక్టర్‌గా నటిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రాన్ని నయన్ కేవలం 25 రోజుల్లో పూర్తి చేశారని చెప్పారు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి ఆమె సహాయదర్శకురాలిగా పనిచేశారని చెప్పారు. తనకు సంబంధించిన సన్నివేశాలు పూర్తి అయినా సెట్‌లోనే ఉండి ఇతర నటీనటుల నటనను గమనించేవారని తెలిపారు. అరమ్ ఒక ముఖ్యమైన అంతర్జాతీయ సమస్యను ఆవిష్కరించే కథా చిత్రం అని పేర్కొన్నారు.
ఇంకా నీటి సమస్యను చర్చించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ విషయం అటుంచితే నయనతార సహాయదర్శకురాలిగా పనిచేయడమన్నదే చర్చనీయాంశంగా మారింది. దర్శకత్వంలో మెళకువలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారా? మెగాఫోన్ పట్టే ఆలోచనగానీ పుట్టిందా? ఒక పక్క దర్శకుడు విఘ్నేశ్‌శివతో సహజీవనం సాగిస్తున్నారనే ప్రచారం సంచలనంగా మరిన పరిస్థితుల్లో నయనతార సహాయదర్శకురాలి బాధ్యతపై ఆసక్తి చూపడంలో ఆంతర్యం ఏమిటి? అసలు ఈ అమ్మడి భవిష్యత్ ప్లాన్ ఏమిటి? లాంటి పలు ప్రశ్నలకు నయనతార తాజాగా తావిచ్చారనే చెప్పవచ్చు. ఏమో గుర్రం ఎగరావచ్చు నన్న నానుడి గుర్తుకొస్తోంది కదూ.