
హైదరాబాద్ : బాహుబలి.. రెండు భాగాలుగా విడుదలైన ఈ తెలుగు చిత్రం ప్రపంచాన్ని చుట్టేసింది. మునుపెన్నడూ లేనంతగా ఇంకా చెప్పాలంటే దిన చర్యలో భాగంగా మాట్లాడుకోవడం ఎంత సహజమో అలా బాహుబలి గురించి మాట్లాడుకోవడం అంత సహజంగా మారింది. అంతగా ఇటు టాలీవుడ్ నుంచి అటు హాలీవుడ్ వరకు బాహుబలి మానియా కొనసాగింది. దాదాపు రూ.1500కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఎన్నో రికార్డులు తిరగేసిన ఈ చిత్రం ఇప్పుడు మరోసారి చర్చవేదికపైకి వచ్చింది. అదేమిటంటే.. ఈ ఏడాది బాహుబలి ఎందుకు ఆస్కార్ నామినేషన్‌కు వెళ్లలేదు అని. చిన్నచిత్రంగా వచ్చిన బాలీవుడ్ చిత్రం న్యూటన్ ఈ ఏడాది భారత్ నుంచి విదేశీ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా కొందరు మీడియా ప్రతినిధులు బాహుబలి సృష్టికర్త దర్శకదీరుడు రాజమౌళిని ప్రశ్నించారు. భారత్ నుంచి ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్ దక్కకపోవడం మీకు నిరాశ కలిగించిందా అన్నదే ఆ ప్రశ్నకు దానికి రాజమౌళి ఏమని బదులిచ్చారో తెలుసా.. 'నేను చిత్రాలు చేసేటప్పుడు అవార్డు గురించి ఎప్పుడూ ఆలోచించను. అది నా గమ్యం కూడా కాదు. కథతో ముందు నన్ను నేను సంతృప్తి పరుస్తుందా లేదా చూస్తాను.. ఆ తర్వాత ఎక్కువమంది ప్రేక్షకులకు నచ్చేలా చూస్తాను. అలాగే, ఆ సినిమాకోసం కష్టపడి పనిచేసే ప్రతిఒక్కరికీ ప్రతిఫలం దక్కాలని కోరుకుంటాను. అవార్డు వస్తే సంతోషిస్తాను.. అలాగే రాకపోతే పట్టించుకోను. నేను విజయాన్ని బాక్సాఫీస్ వసూళ్లలో, ప్రశంసల్లో చూస్తాను.. అవార్డుల్లో కాదు.. అది నాకు ముఖ్యం కూడా కాదు' అని చెప్పారు.