
ప్రముఖ నిర్మాత వెయిన్‌స్టీన్ లైంగిక కుంభకోణం హాలీవుడ్‌ను కుదిపేస్తున్న నేపథ్యంలో మరో హాలీవుడ్ దర్శకుడి బాగోతం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ దర్శకుడు, 'బగ్సీ' సినిమా రచనకుగాను ఆస్కార్ నామినేషన్ అందుకున్న జేమ్స్ టోబ్యాక్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఏకంగా 38మంది మహిళలు ఆరోపించారు. ఈ మేరకు 'ద లాస్ ఏంజిల్స్ టైమ్స్' ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
న్యూయార్క్ స్ట్రీట్‌లో తమను టోబ్యాక్ కలిసి.. సినిమాల్లో స్టార్‌డమ్ కల్పిస్తానని ఆశ చూపేవాడని పలువురు మహిళలు తెలిపారు. ఆయనతో సమావేశాలు చాలాసార్లు లైంగిక ప్రశ్నలతో ముగిసేవని, కొన్నిసార్లు తమ ముందే అతను స్వీయ లైంగిక చర్యకు పాల్పడేవాడని, లేకుంటే లైంగిక చర్యకు రెచ్చగొట్టేలా ప్రవర్తించేవాడని పలువురు గుర్తుచేసుకున్నారు.
72 ఏళ్ల టోబ్యాక్ ఈ ఆరోపణలను తిరస్కరించారు. తనపై ఆరోపణలు చేసిన మహిళలెవరితో తాను సమావేశం కాలేదని, ఒకవేళ ఐదు, పది నిమిషాలు వారితో కలిసినా తనకు వారు గుర్తులేరని చెప్పారు. ట్యూబాక్‌పై లైంగిక ఆరోపణలు చేసిన 38మందిలో 31మంది మహిళలు ఆన్‌రికార్డు మాట్లాడటం గమనార్హం. గిటారిస్ట్, వోకలిస్ట్ లౌవ్‌సీ పోస్ట్, ప్రముఖ నటి టెర్రీకాన్ తదితరులు ఆయన బాగోతాన్ని బయటపెట్టారు. సినిమాలో తమకు అవకాశం వస్తుందన్న ఆశతో అతని లైంగిక ఆగడాలు, వేధింపులు భరించామని కొంతమంది మహిళలు తెలిపారు. టుబ్యాకో కథనం వెలువడిన కాసేపటికే అతనిపై ఆరోపణలు చేసిన మహిళల సంఖ్య రెట్టింపు అయింది. ఈ కథనం తర్వాత మరింతమంది ముందుకొచ్చి అతని ఆగడాలను బయటపెడుతున్నారని టైమ్స్ రిపోర్టర్ గ్లెన్ విప్ తెలిపారు.
హార్వే వెయిన్‌స్టీన్ పలువురు మహిళలపై, నటీమణులపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడినట్టు వెలుగుచూడటం హాలీవుడ్‌లో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. వెయిన్‌స్టీన్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నటి-దర్శకురాలు ఏషియా అర్జెంటోతోపాటు పలువురు టోబ్యాక్ బాగోతాన్ని వెలుగులోకి తెచ్చిన మహిళలకు ఆన్‌లైన్‌లో మద్దతు ప్రకటించారు.