లాస్ ఏంజెలిస్: ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్‌స్టీన్ తనను లైంగిక వేధించడంతో పాటు చంపేస్తానంటూ కొన్నిసార్లు బెదిరించాడని నటి సల్మా హయక్ తెలిపారు. ఇప్పటికే 50కి పైగా నటీమణులు హార్వే వీన్‌స్టీన్ లైంగిక వేధింపులు, అత్యాచారాలపై నోరు విప్పిన సంగతి తెలిసిందే. ధైర్యంగా ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ.. వారి బాటలోనే తాను ముందుకు వచ్చినట్లు హయక్ చెప్పారు. అతడో మానవ మృగమని, ఎందరో ఆడవాళ్ల జీవితాలతో చెలగాటమాడిన ఆ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలన్నారు.
ఏళ్ల తరబడి హర్వే వీన్‌స్టీన్ వేధించాడని ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. 'అతడి ముందు స్నానం చేసేందుకు, మసాజ్ చేసేందుకు, నగ్నంగా ఫొటోలు పంపేందుకు, మరో మహిళతో నగ్నంగా సన్నిహితంగా ఉండేందుకు.. ఇలా పలు పనులకు మీరు నో చెప్పాలంటూ' హార్వే వీన్‌స్టీన్ చర్యలకు వ్యతిరేకంగా ఆమె పిలుపునిచ్చారు. వీన్‌స్టీన్ చెప్పినట్లుగా చేయకపోతే తన అశ్లీల వీడియోలు, ఫొటోలు తీశానని వాటిని అప్‌లోడ్ చేస్తానంటూ వేధించేవాడని సల్మా హయక్ వివరించారు. ప్రస్తుతం ఎంతో మార్పు వచ్చిందని.. బాధితురాళ్లు ఇదే విధంగా తిరుగుబాటు చేస్తే వీన్‌స్టీన్ లాంటి మానవ మృగాల ఆట కట్టించవచ్చన్నారు.
మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఇరుక్కున్ననిర్మాత హార్వే వీన్‌స్టీన్‌పై అమెరికా నిర్మాతల గిల్డ్ (పీజీఏ)జీవిత కాల నిషేధం విధించింది. వీన్‌స్టీన్ ప్రవర్తనపై వెల్లువెత్తిన పలు ఫిర్యాదులను పరిశీలించిన మీదట... పలువురు బాధితురాళ్లు ఇప్పటికీ తాము పడిన ఇబ్బందులను బహిరంగ పరుస్తున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకుంటున్నట్లు పీజీఏ తెలిపింది. 1970వ దశకం నుంచీ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ వీన్‌స్టీన్‌పై ఇప్పటికే 50 మంది సినీ తారలు ఆరోపణలు చేశారు. ఆయనను బ్రిటిష్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అకాడెమీ కూడా బహిష్కరించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment