
జీనియస్ (హిందీ) – అఫీషియల్ టీజర్
నిడివి : 3 ని. 20 సె.
హిట్స్ :1,03,95,447
దర్శకుడు అనిల్ శర్మ పేరు వింటే అందరికీ ‘గదర్’ సినిమా గుర్తుకు వస్తుంది. సన్ని డియోల్, అమిషా పటేల్ నటించిన ఆ సినిమా దేశభక్తి–ప్రేమ కథాంశంగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే ఫార్ములాను నమ్ముకుని అనిల్ శర్మ తన కుమారుడు ఉత్కర్ష్ శర్మను ‘జీనియస్’ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దేశభక్తుడైన ఒక కుర్రాడు ప్రేమ కోసం దేశం కోసం ఏం చేశాడన్నది లైన్. విలన్‌గా నవాజుద్దీన్ సిద్దిఖీ నటించాడు. ఒక పాపులర్ ఫిల్మ్‌లో ఎంత హంగు ఆర్భాటం ఉండాలో అంతా ఈ సినిమాలో కనపడుతోంది. ఇషితా చౌషాన్ హీరోయిన్‌గా నటించింది. ఆగస్టు 24 విడుదల.
శ్రీనివాస కల్యాణం – టీజర్
నిడివి 38 సె.
హిట్స్ :28,62,492
‘శ్రీనివాస కల్యాణం’ పేరుతో గతంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా సినిమా వచ్చింది. హిట్ అయ్యింది. నిర్మాత మురారి తీసిన సినిమా అది. అలాంటి మంచి చిత్రాలు తీసే నిర్మాతగా పేరు గడించిన దిల్ రాజు మళ్లీ అదే టైటిల్‌తో సినిమా తీస్తున్నారు. ఈ మధ్య హీరో నితిన్‌కు సరైన సినిమాలు పడలేదు. హిట్ అవుతాయనుకున్న సినిమాలు కూడా నిరాశ పరిచాయి. కాని కొన్ని గ్యారంటీ సెంటిమెంట్లు ఉన్న సినిమాలు హిట్ అవుతాయన్న ఉద్దేశ్యంతో ఈ సినిమా చేసినట్టున్నారు. దర్శకుడు సతీష్ ‘శతమానం భవతి’తో తన టేస్ట్‌ను నిరూపించుకున్నారు కనుక ఈ సినిమాను కూడా అందంగా తీర్చిదిద్ది ఉంటారన్న అభిప్రాయం అభిమానుల్లో ఉంది. రాశీ ఖన్నా, నందితా శ్వేత హీరోయిన్లు. ప్రకాష్‌రాజ్ ముఖ్యపాత్రలో కనిపిస్తారు. కనుక సినిమా మంచి ఫలితాన్ని సాధిస్తుందని ఆశిద్దాం.
మాటరాని మౌనమిది – షార్ట్‌ఫిల్మ్
నిడివి :9 ని. 56 సె.
హిట్స్ :1,50,112
అబ్బాయిల జీవితంలో అత్యంత ఫ్యాన్సీ నిండిన విషయం ఒకే ఒకటి – అమ్మాయిలతో మాట్లాడటం. కొందరు మంచినీళ్లు తాగినంత సులువుగా అమ్మాలను మాటల బుట్టలో పడేస్తారు. కొందరు మాత్రం కాలకూట విషం మింగుతున్నట్టుగా గడియకొకమాట మాట్లాడి అమ్మాయిలకు ఆన్ ది స్పాట్ నరకం చూపిస్తారు. సాధారణంగా మాటల కోసం తడముకునే అబ్బాయిలకు సాయం పట్టడానికి క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చి గైడ్‌ల అవతారం ఎత్తుతుంటారు. గైడ్‌ల థియరీ ప్రాక్టికల్స్‌లో బెడిసి కొడుతూ ఉంటుంది. ఇదంతా పాత వ్యవహారమే అయినా చూసిన ప్రతిసారీ చిన్న చిరునవ్వు వస్తుంటుంది. ఈ షార్ట్‌ఫిల్మ్ కూడా అలాంటి నవ్వులు పూయిస్తుంది. ‘క్రేజీ ఖన్నా’ పేరుతో ఉన్న యూ ట్యూబ్ చానల్ కోసం రాజేష్ ఖన్నా ముఖ్యపాత్రధారిగా ఈ షార్ట్‌ఫిల్మ్ తయారైంది. హర్షిత ఫిమేల్ లీడ్ చేసింది. సరదాగా చూడొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment