కృష్ణాజిల్లా, తెనాలి: మహానటుడు ఎన్టీ రామారావు సినిమాలను చూస్తూ సినీరంగంపై వ్యామోహాన్ని పెంచుకున్నానని, తన కీర్తి ఆ మహానుభావుడి ఖాతాలోంచి తీసుకుంటున్నట్టుగానే భావిస్తున్నానని సినీ దర్శకుడు, నిర్మాత వైవీఎస్ చౌదరి అన్నారు. ఎన్టీఆర్ అభిమాని కావటం తన పూర్వజన్మ సుకృతమని చెప్పారు. పట్టణానికి చెందిన పోలేపెద్ది నరసింహమూర్తి, తుమ్మల వెంకట్రామయ్య, ఎన్టీ రామారావు కళాపరిషత్ 12వ రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు శుక్రవారం ఇక్కడి టీజే కాలేజీ మైదానంలో ప్రారంభమయ్యాయి. ఎన్టీ రామారావు లెజెండరీ అవార్డును ఈ పర్యాయం సినీ దర్శకుడు వైవీఎస్ చౌదరికి ప్రదానం చేసి స్వర్ణకంకణం బహూకరించారు.
సంస్థ అధ్యక్షుడు, సినీ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా, ప్రధాన కార్యదర్శి షేక్ జానిభాషా, కోశాధికారి ఆరాధ్యుల నాగరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు చౌదరికి అవార్డును అందజేసి సత్కరించారు. ప్రముఖ సినీ పబ్లిసిటీ డిజైనరు కే ఈశ్వర్‌కు ఆత్మీయ సత్కారం చేశారు. అనంతరం కళల కాణాచి లోగోను ఆవిష్కరించారు. కళా పరిషత్ ప్రధాన కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు స్వాగతం పలికిన సభలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు, మాజీ జెడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మి, సోమవరపు నాగేశ్వరరావు, డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, ఏపూరి హరిప్రసాద్, షేక్ ఇర్ఫాన్, ప్రసన్న మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment