బైక్‌ను తప్పించబోయి.. | rtc bus hits car, 2 killed | Sakshi
Sakshi News home page

బైక్‌ను తప్పించబోయి..

Published Fri, Jan 19 2018 9:19 AM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

rtc bus hits car, 2 killed - Sakshi

ఆ కుటుంబ సభ్యులంతా ఉన్నత స్థాయిలోనే ఉన్నారు. విద్యాభ్యాసం, ఉద్యోగాల కోసం కర్ణాటక, పూణె ప్రాంతాల్లో ఉంటున్నారు. సంక్రాంతి పర్వదిన వేడుకలను సొంత గ్రామమైన గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. గురువారం ఉదయం ఇంటి నుంచి తమ సొంత మారుతీ స్విఫ్ట్‌ కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. మరో గంటలో ఇంటికి చేరుకుంటామనేలోపు బస్సు రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరిని కబలించింది. మరో ముగ్గురిని ఆస్పత్రిపాలు చేసింది. ఎలాంటి పొరపాటుకు తావులేకుండా తమ పరిధిలో వెళ్తున్న వీరి కారును ఒక్కసారిగా బస్సు వచ్చి ఢీకొట్టింది. చౌటుప్పల్‌ మండలం పంతంగి గ్రామం వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


చౌటుప్పల్‌(మునుగోడు) : గుంటూరు జిల్లా నర్సరావుపేట గ్రామానికి చెందిన కట్ట పద్మజ (49) అక్కడే ఎస్‌ఎస్‌ఎన్‌ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తుంది. ఈమె కుమారుడు రామచంద్రారెడ్డి(21), కుమార్తె వాసంతి (23)లు కర్నాటకలో ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. వీరితోపాటు పద్మజ తోటి కోడలు కుమార్తె లక్ష్మిప్రియాంక (28) పూణెలో పీడియాట్రిక్‌ చదివింది. అక్కడే ఉద్యోగ ప్రయత్నాల్లో నిమగ్నమైంది. వీరందరు కలిసి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. పిల్లలు ముగ్గురిని హైదరాబాద్‌ నుంచి పంపించేందుకు పద్మజ డ్రైవర్‌ కృష్ణారెడ్డి(27)ని తీసుకొని వస్తున్నారు. లక్ష్మిప్రియాంక విమానంలో పూణెకు, వాసంతి, రాంచంద్రారెడ్డిలు బస్సులో కర్నాటకకు వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం హైదరాబాద్‌కు వచ్చి సాయంత్రం వరకు బంధువుల ఇంట్లో ఉండి సాయంత్రం పిల్లలను పంపించేందుకు నిర్ణయించుకున్నారు. ఆ మేరకు వారంతా ఉల్లాసంగా మాట్లాడుకుంటూ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

బైకును తప్పించే క్రమంలో చోటుచేసుకున్న ప్రమాదం
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌ నుంచి 25 మంది ప్రయాణికులతో మిర్యాలగూడకు బయలుదేరింది. జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో వెళ్తున్న మరో బస్సు వెనుక నుంచి ఈ బస్సు వెళ్తుంది. ఇదే సమయంలో పంతంగి గ్రామ స్టేజీ వద్ద ఓ ద్విచక్ర వాహనం ఒక్కసారిగా బస్సులకు అడ్డుగా వచ్చింది. ముందున్న బస్సు బైకును తప్పించుకుని వెళ్లాడు. వెనుక ఉన్న ఈ బస్సుకు తప్పించే అవకాశం లేకపోవడంతో చేసేదేమి లేక డ్రైవర్‌ జావిద్‌ ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా జంక్షన్‌ నుంచి బస్సును అదే వేగంతో  హైదరాబాద్‌ వెళ్లే మార్గంలోకి మళ్లించాడు.  సరిగ్గా అదే సమయంలో అటుగా వస్తున్న కారు బస్సుకు ఢీకొట్టింది. బలంగా తగలడంతో కారు బస్సు కిందకు ఇరుక్కుపోయింది. అందులోని ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు అదే వేగంతో రోడ్డు కిందకు దూసుకుపోయింది. బస్సులోని ప్రయాణికులు పూర్తిగా సురక్షితంగా బయటపడినప్పటికీ భయబ్రాంతులకు గురయ్యారు.

ఐదుగురిలో ఇద్దరు దుర్మరణం
ఈ ప్రమాదంలో కారులోని ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కారులో డ్రైవర్‌తోపాటు ముందు సీట్లో కూర్చున్న రామచంద్రారెడ్డిలతో పోలిస్తే వెనుక సీట్లో కూర్చున్న ముగ్గురికి బలమైన గాయాలయ్యాయి. వారిని కారులో నుంచి బయటకు తీసేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నం చేసి క్రేన్‌ సాయంతో బయటకు తీశారు. హుటాహుటిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స ప్రారంభించగానే పద్మజ మృతి చెందింది. మిగతావారి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. వారిలో లక్ష్మిప్రియాంకను కామినేని ఆస్పత్రికి, మిగతా ముగ్గురుని సన్‌రైజ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స ప్రారంభించగానే కామినేని ఆస్పత్రిలో లక్ష్మిప్రియాంక సైతం మృతి చెందింది.  మిగతా ముగ్గురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్ష్మిప్రియాంకకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త పూణేలో ఉద్యోగం చేస్తున్నాడు.

ఘటన స్థలాన్ని సందర్శించిన ఏసీపీ రమేష్‌
సమాచారం తెలిసిన వెంటనే స్థానిక ఏసీపీ రామోజు రమేష్, సీఐ వెంకటయ్యలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల నుంచి అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. కారును క్రేన్‌ సాయంతో బస్సు కింద నుంచి తప్పించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతదేహాలకు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుల బంధువుల రోదనలు ఆస్పత్రి ఆవరణలోని పలువురిని కంటతడిపెట్టించాయి. పద్మజ భర్త శ్రీధర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement