నల్లగొండ : నిరంతర విద్యుత్ సరఫరా రైతాంగాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. గతంలో రెండు విడతలుగా వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేసిన రోజులతో పోలిస్తే నిరంతర విద్యుత్ సరఫరా ఒడిదుడుకులు ఎదుర్కొటోంది. కోతలు లేకుండా విద్యుత్ సరఫరా వివిధ కేటగిరీలకు చెందిన వర్గాలకు మేలు జరుగుతోంది కానీ, వ్యవసాయరంగాన్ని మాత్రం ఇరకాటంలోకి నెట్టేస్తోంది. నిరంతర విద్యుత్ తాకిడికి వ్యవసాయ మోటార్లు బోరున మొత్తుకుంటున్నాయి. ఆటోమేటిక్ స్టార్టర్లు తొలగించకుండా నీటి వాడకాన్ని బట్టి పంపుసెట్లు ఆన్‌చేసేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. కానీ ఒకే సమయంలో పంపుసెట్లన్నీ పనిచేస్తుండటంతో ఆ ప్రభావం భూగర్భ జలాలపైన పడుతోంది.
గతంలో రెండు విడతలుగా విద్యుత్ సరఫరా చేసిన రోజుల్లో వ్యవసాయ ఫీడర్లను రెండు గ్రూపులుగా విభజించి, పగలు, రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా చే శారు. ప్రస్తుతం నిరంతర విద్యుత్ అమల్లోకి వచ్చిన తర్వాత రైతులు పగటిపూటనే ఎక్కువ వినియోగిస్తున్నారు. దీంతో రాత్రి వేళల్లో వ్యవసాయానికి విద్యుత్ డిమాండ్ అంతగా ఉండటం లేదు. నిరంతర్ విద్యుత్ అమల్లోకి వచ్చిన 12 రోజుల్లో విద్యుత్ డిమాండ్ ఓసారి పరిశీలిస్తే....ఈ నెలలో జిల్లాకు కేటాయించిన విద్యుత్ కోటా 18.30 మిలియన్ యూనిట్లు కాగా...వినియోగం రోజుకో రకంగా ఉంటోంది. ఈ నెల ఒకటో తేదీన 26.911 మిలియన్ యూనిట్లు, 4 తేదీన 26.33 ఎం.యూ, 7వతేదీన 25. 02 ఎం.యూ, 12న 24.55 మిలియన్ యూనిట్లు విద్యుత్ వాడకం జరిగింది. కోటాకు మి ంచి సగటున 6.25 ఎం.యూ పెరిగింది.
ఉదయం 8 గంటల నుంచే...
నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నప్పటి నుంచి పగటి పూటనే విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 11, 12 గంటల వరకు విద్యుత్ వినియోగం భారీగా ఉంటోంది. ఉదాహరణకు ఈ నెల 12న ఉదయం 8 గంటలకు 1068 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తే రాత్రి 11 గంటల సమయంలో 808 మెగావాట్లకు తగ్గిపోయింది. కోతల్లేని విద్యుత్ కారణంగా వ్యవసాయంతో పాటు, పరిశ్రమలకు కూడా మేలు జరుగుతోంది. పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ వాడకం రికార్డు స్థాయికి చేరింది. నల్లగొం డ, హుజూర్‌నగర్, భువనగిరి ప్రాంతాల్లో పారిశ్రామిక సంస్థలు అత్యధికంగా ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతాల్లో విద్యుత్ కోటాకు మించి వినియోగం పెరిగింది. నల్లగొండ డివిజన్‌కు కేటాయించిన కోటా 3.04 మిలియన్ యూనిట్లు కాగా, వాడకం 4.30 ఎం.యూ. అదేవిధంగా హుజూర్ నగర్ డివిజన్‌కు కేటాయించిన కోటా 4.56 ఎం.యూ కాగా వాడకం 5.12 ఎం.యూ, భువనగిరి డివిజన్ కోటా 3.18 ఎం.యూకు గాను రూ.4.63 ఎం.యూకు చేరింది.
అడుగంటిన జలం...
జిల్లాలో సాధారణంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు తోడు, నిరంతర విద్యుత్ సరఫరా కారణంగా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 3,85,105 ఉన్నాయి. వీటిల్లో 3,61,165 కనెక్షన్లకు ఆటోస్టార్టర్లు ఉంచారు. స్టార్టర్లు లేని కనెక్షన్లు 23,940 ఉన్నాయి. విద్యుత్ డిమాండ్ పగటి పూటనే ఎక్కువగా ఉన్నందున భూగర్భ జలాలు క్రమేపీ తగ్గుతూ వస్తోన్నాయి. భూగర్భ జల వనరుల శాఖ నివేదిక ప్రకారం నల్లగొండ జిల్లాలో నవంబర్‌లో భూగర్భ జల మట్టాలు 8.64 అడుగుల లోతులో ఉండగా డిసెంబర్‌లో 9.17 అడుగులకు పడిపోయాయి. అంటే నీటిమట్టం 0.53 అడుగులకు తగ్గింది. సూర్యాపేట జిల్లాలో నవంబర్‌లో 8.11 అడుగులు ఉండగా డిసెంబర్‌లో 8.82 అడుగులకు పడిపోయాయి. 0.71 అడుగులకు నీటి మట్టాలు తగ్గాయి. యాదాద్రి జిల్లాలో నవంబర్‌లో 9.58 అడుగులకు నీటి మట్టాలు ఉండగా, డిసెంబర్‌లో 10.13 అడుగులకు పడి పోయాయి. 0.55 అడుగుల లోతుకు నీటి మట్టాలు తగ్గాయి.
అవసరం మేరకు విద్యుత్ వాడుకోవాలి
నిరంతర విద్యుత్ వద్దని, పాత పద్ధతిలోనే విద్యుత్ ఇవ్వాలని రైతుల నుంచి వినతులు వస్తున్నాయి. బోరుబావులు, ఆయకట్టు రైతుల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. రైతులు అవసరం మేరకు విద్యుత్ వాడుకోవాలి. నిరంతరం విద్యుత్ వద్దని చెప్పకుండా ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాత్రమే మోటార్లు నడుపుకోవాలని సూచిస్తున్నాం. రైతులు స్వచ్ఛందంగా ఆటోమేటిక్ స్టార్టర్లు తొలగించుకోవాలని కోరుతున్నాం. ప్రస్తుతం వ్యవసాయ పనులు సీజన్ కావడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. ఈ నెల మొదటి వారంలో ఉన్నంత డిమాండ్ ఆ తర్వాత తగ్గుతూ వస్తోంది. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరా యాలు లేవు. కృష్ణయ్య, ఎస్‌ఈ
Comments
Please login to add a commentAdd a comment