
వీహెచ్‌పీ నేత సాధ్వి సరస్వతి (ఫైల్‌పోటో)
సాక్షి, జంషెడ్‌పూర్ : గోవధను నిరోధించేందుకు జీవితఖైదుతో కూడిన కఠిన చట్టాన్ని తీసుకురావాలని వీహెచ్‌పీ నేత సాధ్వి సరస్వతి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గోవధను నియంత్రిస్తూ పలు రాష్ట్రాలు చట్టాలు చేసినా జాతీయస్థాయిలో కేంద్రం సరైన చట్టాన్ని తీసుకువచ్చి పకడ్బందీగా అమలు చేయాలని ఆమె కోరారు. కేరళలో హిందూ కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశానని తనపై ఏప్రిల్ 30న కేసు నమోదు చేసినా తాను తన కార్యకలాపాలను కొనసాగిస్తానని సాధ్వి సరస్వతి స్పష్టం చేశారు.
కేరళలో జరిగిన హిందూ సమ్మేళనం కార్యక్రమంలో హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హిందూ జాగరణ్ మంచ్ కార్యక్రమంలో పాల్గొన్న సాధ్వి సరస్వతి తనపై కేసులున్నా తనను అవి నిరోధించలేవన్నారు. బీఫ్ తినడంపై తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తన ఫేస్‌బుక్ పేజీలో 600 మందికి పైగా వ్యక్తులు తనను ట్రోల్ చేశారని చెప్పారు. జాప్యం నెలకొన్నా అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగి తీరుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.