కోల్‌కతా: చైనా నుంచి టిబెట్ స్వాతంత్య్రాన్ని ఆశించడం లేదని టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా స్పష్టం చేశారు. అయితే అభివృద్ధి మాత్రం కోరుకుంటుందని చెప్పారు. గురువారం ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై మేం భవిష్యత్తు కోసం ఆలోచించాలి’ అని అన్నారు. చైనా, టిబెట్‌ల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగినా.. సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
చైనాతోనే ఉండాలని టిబెటన్లు కోరుకుంటున్నారని, అందువల్ల స్వాతంత్య్రాన్ని కాకుండా మరింత అభివృద్ధి ఆశిస్తున్నామని దలైలామా వెల్లడించారు. అదే సమయంలో టిబెటన్ల సంస్కృతి, వారసత్వాన్ని చైనా తప్పనిసరిగా గౌరవించాలని ఆయన స్పష్టం చేశారు. ‘టిబెట్‌కు ప్రత్యేక సంస్కృతి, భాషలు ఉన్నాయి. చైనా ప్రజలు వారి దేశాన్ని ప్రేమిస్తారు. మేం మా దేశాన్ని ప్రేమిస్తాం’ అని చెప్పారు. గత కొన్ని దశాబ్దాలుగా చైనా ఎంతో మారిపోయిందని, ప్రపంచంతో సాగడం వల్ల గతంతో పోలిస్తే 40 నుంచి 50 శాతం వరకూ మారిపోయిందన్నారు.
భారతీయులు బద్ధకస్తులు
చైనీయులతో పోలిస్తే భారతీయులు బద్ధకస్తులని దలైలామా పేర్కొన్నారు. అయితే భారత్ అత్యంత నిలకడైన దేశమని, ప్రపంచ వేదికపై కీలక పాత్ర పోషించే సత్తా ఉందని చెప్పారు. భారత్‌లోని పరమత సహన స్ఫూర్తిని ఆయన కొనియాడారు. భారత్, చైనాలు హిందీ–చీనీ భాయ్ భాయ్ స్ఫూర్తితో సాగాలని సూచించారు. భారతీయుల నవ్వు స్వచ్ఛమైనదని, చైనా అధికారులు కృత్రిమంగా నవ్వడంలో నిపుణులని దలైలామా నవ్వుతూ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment