పెను తుపాను పై-లీన్ ఒడిశాలో 1.23కోట్ల మందిని బాధితులుగా మిగిల్చింది. 17 జిల్లాల్లోని 18,117 గ్రామాలపై తుపాను, వరదలు ప్రభావం చూపాయి.
భువనేశ్వర్: పెను తుపాను పై-లీన్ ఒడిశాలో 1.23కోట్ల మందిని బాధితులుగా మిగిల్చింది. 17 జిల్లాల్లోని 18,117 గ్రామాలపై తుపాను, వరదలు ప్రభావం చూపాయి. తాజా గణాంకాలను ఒడిశా సర్కారు గురువారం విడుదల చేసింది. ఐదు జిల్లాలలో వరదనీరు తగ్గుముఖం పట్టడంతో సహాయ, పునర్నిర్మాణ కార్యక్రమాలపై పెద్ద ఎత్తున దృష్టి సారించింది. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగింది. గంజాం జిల్లాలో మూడు, నయాగఢ్ జిల్లాలో రెండు మృతదేహాలు బయట పడడంతో మృతుల సంఖ్య 43కు చేరుకుంది.
బాలాసోర్ జిల్లాలోని బాలిపాల్, భోగరాయ్ తాలూకాలు ఇంకా ముప్పు ఎదుర్కొంటున్నాయని పునరావాస ప్రత్యేక కమిషనర్ పీకే మొహపాత్రా భువనేశ్వర్‌లో మీడియాకు తెలిపారు. సహాయ, పునర్నిర్మాణ కార్యక్రమాలపైనే తమ ప్రధాన దృష్టి అని ఒడిశా రెవెన్యూ, విపత్తుల నిర్వహణ మంత్రి ఎస్‌ఎన్ పాత్రో పేర్కొన్నారు. గంజాం, బాలాసోర్, మయూర్‌భంజ్‌పై తుపాను, వరదల ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. గంజాం జిల్లాలో ఎనిమిది లక్షల కుటుంబాలు తుపాను ప్రభావానికి గురయ్యాయని చెప్పారు.