ఫైలిన్ తుపాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి ఒడిశాను వరదలు ముంచెత్తుతున్నాయి.
ఫైలిన్ తుపాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి ఒడిశాను వరదలు ముంచెత్తుతున్నాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో సోమవారం కూడా వేలాదిమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక, పునరావాస కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నారు.
ఒడిశాలో బద్ధ బలంగ, బైటరని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీరు మయూర్భంజ్, బలసోర్ జిల్లాలో చాలా ప్రాంతాలకు చేరడంతో సహాయక చర్యల కోసం అధికారుల్ని ఆ ప్రాంతాలకు పంపించారు. చాలా ఇళ్లు కూలిపోగా, వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి సూర్యనారాయణ పాత్రో తెలిపారు. ఇళ్లు దాదాపు ఐదారు అడగుల మేర నీటిలో మునిగిపోయాయి. కొందరు భవనాల పైకప్పు మీదకు చేరుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. ఒడిశాలో నదులు చాలావరకు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో ఇతర జిల్లాల్లోనూ ప్రజల వరదల తాకిడికి భయపడుతున్నారు. తుఫాన్ ప్రభావానికి ఆ రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 21కు పెరిగింది.