647 గ్రామాలు ఇంకా వరదలోనే... | Cyclone Phailin: 647 villages still marooned in Odisha | Sakshi
Sakshi News home page

647 గ్రామాలు ఇంకా వరదలోనే...

Published Thu, Oct 17 2013 1:18 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM

647 గ్రామాలు ఇంకా వరదలోనే...

647 గ్రామాలు ఇంకా వరదలోనే...

భువనేశ్వర్: పై-లీన్ బీభత్సంతో అతలాకుతలమైన ఒడిశాలో 647 గ్రామాలు ఇంకా వరద నీటిలోనే మగ్గుతున్నాయి. బాలాసోర్ జిల్లాలోని బస్తా, భోగరాయ్, జలేశ్వర్, బలియాపాల్ బ్లాకుల్లో వరద ఇంకా తగ్గుముఖం పట్టలేదు. మిగతాచోట్ల పరిస్థితి మెరుగుపడింది. ప్రధాన నదుల్లో వరద ఉధృతి తగ్గింది. సహాయక కార్యక్రమాలు ఓ కొలిక్కి రావడంతో ఆర్మీ, నేవీ, వైమానిక దళాలను వెనక్కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. అయితే స్థానిక జాతీయ విపత్తు సహాయక దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్) యూనిట్ మరికొన్ని రోజులు బాలసోర్ జిల్లాలోనే ఉంటుందని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న ప్రత్యేక కమిషనర్ పీకే మహాపాత్రో తెలిపారు. జిల్లాలోని 83 పంచాయతీల పరిధిలో 647 గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయని ఆయన వివరించారు. మయూర్‌భంజ్, భద్రక్, జాజ్‌పూర్, కోయెన్‌జార్‌లలో పరిస్థితి మెరుగుపడుతోందని చెప్పారు.
 
  జిల్లాకు చెందిన 96 వేల మంది నిరాశ్రయులు వివిధ సహాయక కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. భద్రక్ జిల్లాలో వైతరణి నది పొంగుతుండడంతో 70 గ్రామాలకు ముంపు ముప్పు పొంచి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక పెను నష్టాన్ని చవిచూసిన గంజాం జిల్లాలో విద్యుత్ లైన్లు, రోడ్డు మార్గాల పునరుద్ధరణ పనులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. అంటువ్యాధులు వ్యాప్తిచెందకుండా ఉండేందుకు నీటిని శుద్ధిపరిచే చర్యలకు శ్రీకారం చుట్టింది. కాగా, ఒడిశాలో పై-లీన్ దెబ్బకు బుధవారం నాటికి 36 మంది మరణించగా, జార్ఖండ్‌లో ఐదుగురు మృతిచెందారు.
 
 నిధులు విడుదల చేయండి: ఒడిశాలో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా తక్షణమే రూ.1,523 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశారు. తీవ్రంగా నష్టపోయిన గంజాం జిల్లాలో విద్యుత్ వ్యవస్థకు మరమ్మతులు చేపట్టేందుకే 900 కోట్లు అవసరమవుతాయని లేఖలో పేర్కొన్నారు.
 
 ఉదారంగా విరాళాలు ఇవ్వండి: సీఎం
 వరద బారిన పడిన బాధితులను ఆదుకునేందుకు ఉదారంగా విరాళాలు ఇవ్వాల్సిందిగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ విజ్ఞప్తి చేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకు రావాల్సిందిగా ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేటు, వాణి జ్య, పారిశ్రామిక రంగ సంస్థలను కోరారు. విరాళాలను చెక్కుల ద్వారాగానీ, డ్రాఫ్ట్‌ల ద్వారా గానీ ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపాల్సిందిగా సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement