
లుమ్‌థారి: మేఘాలయలో అక్రమంగా నిర్వహిస్తున్న గనిలో పోటెత్తిన వరదల్లో చిక్కుకుని 13 మంది కార్మికులు గల్లంతయ్యారు. ఈస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలో గురువారం ఈ ఘటన చోటుచేసుంది. వర్షానికి గని సొరంగ మార్గం కుప్పకూలడంతో వారు నీటిలో కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదం గురించి తెలియగానే జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందాలు, రాష్ట్ర విపత్తు సహాయక బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. పంపులతో నీటిని బయటకు తోడుతున్నారు. అయినా గల్లంతైన వారి జాడ తెలియరాలేదు. వారు బతికి ఉండే అవకాశాలు తక్కువేనని భావిస్తున్నారు.
370 అడుగుల లోతున్న ఆ గనిలో 70 అడుగుల వరకు నీరు చేరినట్లు పోలీసులు తెలిపారు. నీటి ఉధృతి తగ్గకపోతే మరో రెండు పంపుల్ని వినియోగించాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైతే గజ ఈతగాళ్ల సాయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు, వరదలు ప్రారంభమైనప్పుడు గని నుంచి ఐదుగురు బయటికి రావడం చూశామని స్థానికులు చెప్పారు. కానీ, ఆ ఐదుగురి జాడ తెలియరాలేదు. అక్రమంగా గనిని నిర్వహిస్తున్న యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment