
పోలీసులే స్టన్ అయిపోయారు..!
బులంద్ షహర్ః అత్యాచారాలకు అడ్డాగా మారిన ఉత్తర ప్రదేశ్ లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. బులంద్ షహర్ లో తల్లీ కూతుళ్ళపై అఘాయిత్యం ఘటన మరువక ముందే మరో దారుణం బయటపడింది. ఆర్నెల్లపాటు అత్యాచారానికి గురైన 14 ఏళ్ళ మైనర్ బాలిక.. బలవంతంగా తొలగించబడ్డ తన గర్భంలోని పిండాన్ని పట్టుకొని సరాసరి స్టేషన్ కు రావడం పోలీసులకు సైతం దిగ్భ్రాంతిని కలిగించింది.
చేతిలోని పాలిథిన్ బ్యాగ్ లో పిండాన్ని పెట్టుకొని 14 ఏళ్ళ బాలిక.. సరాసరి బులంద్ షహర్ స్టేషన్ కు రావడంతో పోలీసులు విస్తుపోయారు. తనపై ఆర్నెల్లపాటు అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు ఆ చిన్నారి సరాసరి పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లు వివరాలను బట్టి తెలుస్తోంది. నిందితుడు యూనస్ అహ్మద్ ఆర్నెల్లపాటు బాలికపై అత్యాచారానికి పాల్పడటమే కాక, ఆమె గర్భాన్ని చేతులతో బలవంతంగా తొలగించాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆగస్టు 28న తనకు వచ్చినది మామూలు కడుపునొప్పే అనుకున్న బాధితురాలు.. తర్వాత అది సాధారణ కడుపు నొప్పి కాదని, తాను గర్భంతో ఉన్నానని తెలుసుకుంది. విషయం తెలిసిన బాధితురాలి తల్లి సహా కుటుంబ సభ్యులు యూనస్ బలాత్కారం చేశాడంటూ ఆరోపణలకు దిగారు. దీంతో అక్కడే ఉన్నయూనస్.. బాలికపై దాడిచేశాడు. చేతులతో మోది.. ఆమె గర్భంనుంచీ పిండం బయటకు వచ్చేట్లు చేశాడు.
కాగా ఇటీవల బులంద్ షహర్లో కారులో ప్రయాణిస్తున్న తల్లీ కూతుళ్ళను బయటకు లాగి మరీ దుండగులు అత్యాచారానికి పాల్పడటం ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురి చేసింది. అటువంటి ఘోర ఘటన మరువక ముందే.. మైనర్ బాలికపై ఆర్నెల్లపాటు అత్యాచారం చేయడం.. ఆమె గర్భాన్నిబలవంతంగా తొలగించడం.. బులంద్ షహర్ వాసులను భయకంపితుల్ని చేస్తోంది.