
దేశ రాజధాని నగరం ఢిల్లీలో మంగళవారం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందారు.
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో మంగళవారం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందారు. కరోల్‌బాగ్‌లోని అర్పిత్ ప్యాలెస్ అనే హోటల్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున నాలుగు గంటలకు అందరూ గాఢనిద్రలో ఉండగా అకస్మాత్తుగా మంటలు అంటుకుని క్షణాల్లో వ్యాపించడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. హోటల్‌లోని నాలుగు, ఐదు అంతస్థులకు మంటలు వ్యాపించాయి. ప్రమదానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదు.
ప్రమాద సమయంలో హోటల్‌లోని 65 గదుల్లో దాదాపు 150 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ వ్యక్తి భవనం పైనుంచి కిందకు దూకేశాడు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక శిశువు కూడా ఉన్నారు. మంటల నుంచి తప్పించుకునేక్రమంలో ఒక మహిళ తన బిడ్డతో కలిసి కిటికీ లోంచి దూకడంతో వీరిద్దరూ మృత్యువాత పడ్డారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 35 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి 26 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తొక్కిసలాట కారణంగానే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.