
షహజాన్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది మృత్యువాతపడ్డారు. షహజాన్‌పూర్‌లోని జమ్కా క్రాసింగ్స్ వద్ద మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఎస్పీ దినేశ్ త్రిపాఠి తెలిపారు. అధిక వేగంతో వస్తున్న ట్రక్ మొదట టెంపోను ఢీకొట్టి, తర్వాత పక్కనే ఉన్న వ్యాన్‌ను సైతం ఢీకొట్టింది. ఆ తర్వాత ట్రక్కు తిరగబడి వ్యాన్‌పై పడింది. ఈ రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్న వారిలో 16 మంది ఘటనాస్థలిలోనే ప్రాణాలుకోల్పోయారు. మరొక మహిళ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ప్రమాదం అనంతరం ట్రక్ క్లీనర్ పోలీసులకు చిక్కగా, డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. మరణించివారి కుటుంబాలకు నిబంధనల ప్రకారం ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తామని స్పష్టంచేశారు.