
18 మంది మృత్యువాత
హిమాచల్‌ప్రదేశ్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 18 మంది చనిపోగా, 24 మంది గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
హిమాచల్‌లో నదిలో పడిన బస్సు
మండీ: హిమాచల్‌ప్రదేశ్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 18 మంది చనిపోగా, 24 మంది గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మండీ జిల్లా నుంచి 40 మంది ప్రయాణికులతో కులూ వెళ్తున్న ప్రైవేట్ బస్సు బృందావని సమీపంలో బియాస్ నది వద్ద.. ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయింది. ఈ క్రమంలో బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి ఐజీ, మండీ డిప్యూటీ పోలీస్ కమిషనర్‌లు రెస్క్యూ బృందాలతో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై సీఎం ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 15,000, క్షతగాత్రులకు రూ.5,000 తక్షణ సాయం అందిస్తామని తెలిపారు.
గుజరాత్ రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది భక్తులు మృతి చెందగా..ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వల్తేరాపాటియా గ్రామ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి 17 మంది భక్తులతో ప్రయాణిస్తున్న ఓ మినీ బస్సును వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. బస్సులో ఉన్న 14 మంది భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతి చెందిన వారంతా గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా సోక్‌దా గ్రామానికి చెందినవారని, పంచమహల్స్ జిల్లాలోని పావగ ధ్ గ్రామంలోని దర్శనీయ క్షేత్రంలో దైవదర్శనం చేసుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు జిల్లా పోలీసులు తెలిపారు.