డ్రంక్ & డ్రైవ్..
సంవత్సరం 2015
ప్రమాదాలు 5,01,423
మృతులు 1,46,133
మద్యం, డ్రగ్స్ వల్ల ప్రమాదాలు 16,298
రోజుకు19 మంది.. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాల్లో దేశంలో మరణిస్తున్న వారి సంఖ్య ఇదీ. 2015లో దేశంలో మొత్తం 5,01,423 రోడ్డు ప్రమాదాలు జరిగితే.. 1,46,133 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 16,298(3.2 శాతం) ప్రమాదాలు మద్యం సేవించడం, డ్రగ్స్ తీసుకోవడం వల్ల జరిగినవే అని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల్లో వెల్లడైంది. 2015లో డ్రంక్ అండ్ డ్రైవ్ , డ్రగ్స్ కారణంగా జరిగే ప్రమాదాల్లో 6,755 మంది మృత్యువాతపడగా.. 18,813 మంది క్షతగాత్రులయ్యారు. ఇక 2015లో ప్రతి పది నిమిషాలకు తొమ్మిది రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే.. అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నారట. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ గణాంకాలు వెల్లడించాయి.
తక్కువగా అంచనా వేస్తున్నారు..
మద్యం తాగడం వల్ల జరిగే ప్రమాదాలను తక్కువగా అంచనా వేస్తున్నారని యేల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈ సర్వేకు సహ నేతృత్వం వహించిన డేనియల్ కెనిస్టన్ చెప్పారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవడం ఆలస్యమైతే.. ప్రమాదానికి మద్యం కారణమా కాదా అనేది తెలుసుకోవడం కష్టమవుతుందని చెప్పారు. అమెరికా పరిశోధకులు, రాజస్థాన్ పోలీసులు కలసి ఆ రాష్ట్రంలో ఓ యాంటీ డ్రంక్ అండ్ డ్రైవ్ పోగ్రామ్‌ను అమలు చేశారు. ఒక నిర్దిష్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు నెలల్లో దీనిని అమలు చేయగా.. రాత్రిపూట జరిగే ప్రమాదాల సంఖ్య 17 శాతం తగ్గగా.. మరణాల సంఖ్య 25 శాతం తగ్గింది. పోలీసు తనిఖీలను విస్తృతం చేస్తే రోడ్డు ప్రమాద మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని వీరు చెపుతున్నారు. 2010–2011 మధ్య జరిగిన ఈ సర్వే నివేదిక ఇటీవల విడుదలైంది.
మద్యం వల్లే ఎక్కువ..
సాధారణంగా డ్రైవర్ల తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాల కంటే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే ప్రమాదాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని అమెరికా బోస్టన్‌లో ఉన్న మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధన యూనిట్ అబ్దుల్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్(జే–పీఏఎల్)కు చెందిన పరిశోధకులు, రాజస్థాన్‌లో రాష్ట్ర పోలీసుల సర్వేలో వెల్లడైంది. మద్యం సేవించడం వల్ల సాధారణంగా జరిగే 2.4 ప్రమాదాలకు ఒకరు మరణిస్తుంటే.. మందు తాగి ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించడం.. ఘాట్ రోడ్డులో ప్రయాణించడం వల్ల జరిగే 2.9 ప్రమాదాల్లో ఒకరు.. అడ్డదిడ్డంగా వాహనాన్ని నడపడం వల్ల ప్రతి 3.06 ప్రమాదాలకు ఒకరు మృత్యువాత పడుతున్నారట.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం అన్ని ప్రమాదాల్లోనూ మద్యం తాగడం వల్ల జరిగే ప్రమాదాల సంఖ్య 1.5 శాతం. ఇతర కారణాలతో పోలిస్తే అతి ఎక్కువగా జరుగుతున్న ప్రమాదాలు ఇవే. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాల్లో 42 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే ఓవర్ స్పీడ్ వల్ల 30 శాతం.. నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ వల్ల 33 శాతం.. వాతావరణ పరిస్థితుల వల్ల 36 శాతం మంది మరణిస్తున్నారు.
- సాక్షి తెలంగాణ డెస్క్