
'ఆ కాల్పులు జలియన్ వాలాబాగ్ కంటే హేయం'
కొల్కత్తా: 1993 కోల్కతాలో పోలీసుల కాల్పులపై జస్టిస్ సుశాంత ఛటర్జీ కమిషన్ తన తుది నివేదికను సోమవారం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ ఘటనలో పోలీసుల వైఖరిని కమిషన్ తప్పుపట్టింది. ఈ కాల్పుల ఘటన జలియన్ వాలాబాగ్ ఘటన కంటే హేయమైనదని కమిషన్ అభివర్ణించింది. పోలీసులు కనిపించిన వారిని కనిపించినట్లు పిట్టల్లా కాల్చేశారని కమిషన్ తన నివేదికలో పేర్కొంది.
1993లో కోల్కతా మహానగరంలోని రాష్ట్ర సచివాలయం 'రైటర్స్ బెల్డింగ్' వద్ద తృణముల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీని అడ్డుకోవాలని అప్పటి వామపక్ష ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
దాంతో ర్యాలీపై పోలీసులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. మరో 50 మంది గాయపడ్డారు. దీనిపై జస్టిస్ సుశాంత ఛటర్జీ కమిషన్ ఏర్పాటైంది. దాదాపు 300 మంది సాక్షులను విచారించిన కమిషన్ తన తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.