గ్రెనేడ్ దాడులతో దద్దరిల్లిన షాపియన్!
శ్రీనగర్ః జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాదులు దాడులకు దిగారు. పది నిమిషాల వ్యవధిలో రెండుసార్లు గ్రెనేడ్లతో దాడులకు పాల్పడ్డారు. పోలీసులే లక్ష్యంగా చేసుకున్న టెర్రరిస్టులు ఓ పోలీస్ స్టేషన్ పై గ్రెనేడ్ విసిరారు. మరోచోట పోలీస్ చెక్ పోస్ట్ పై కూడ గ్రెనేడ్ తో దాడి చేశారు. గ్రెనేడ్ స్టేషన్ బయటే పేలిపోవడంతో తృటిలో భారీ ప్రమాదం తప్పగా, చెక్ పోస్ట్ ప్రాంతంలో ఇద్దరు సాధారణ పౌరులకు గాయాలయ్యాయి.
కాశ్మీర్ లోని షాపియన్ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన టెర్రరిస్టుల గ్రెనేడ్ దాడుల్లో ఇద్దరు సాధారణ పౌరులు గాయపడ్డారు. సాయంత్ర 5.30 ప్రాంతంలో షాపియన్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ బిల్టింగ్ ప్రాంతంలో టెర్రరిస్టులు పోలీస్ స్టేషన్ పై గ్రెనేడ్ విసిరినట్లు అధికారులు వెల్లడించారు. అయితే గ్రెనేడ్ పోలీస్ స్టేషన్ కాంపౌండ్ లోపలే పడిపోవడంతో ఎటువంటి నష్టం జరగలేదని తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు 200 మీటర్ల దూరంలోనే ఉన్న చెక్ పోస్టుపై కూడ టెర్రరిస్టులు గ్రెనేడ్ తో దాడులు జరిపారని, ఆ దాడుల్లో ఇద్దరు పౌరులు గాయపడినట్లు వెల్లడించారు. గాయపడిన వారిని చికిత్సకోసం స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఉన్నట్లుండి జరిగిన దాడులతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగి మిలిటెంట్లకోసం గాలిస్తున్నారు.