కువైట్లో ఉగ్రదాడి మృతులకు శనివారం సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తున్న దృశ్యం
కువైట్ సిటీ: కువైట్లోని ఇమామ్ సిద్దీఖీ మసీదు వద్ద గత శుక్రవారం ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతిదాడిలో మరణించినవారిలో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ సుల్తాన్పూర్ జిల్లా వలీపూర్నకు చెందిన రిజ్వాన్ హుస్సేన్ (31) మసీదులో వాచ్మన్గానూ, అంబేద్కర్నగర్ జిల్లా జలాల్పూర్నకు చెందిన ఇబ్నే అబ్బాస్ (25) డ్రైవర్గానూ కువైట్లో పనిచేస్తున్నారు.
శుక్రవారం ప్రార్థనల కోసం వారు మసీదుకు వెళ్లినప్పుడు పేలుడు సంభవించి మరణించారు. ఈ ఇరువురు సహా మొత్తం 26 మంది ఈ ఘటనలో దుర్మరణం చెందారు. పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న 200 మందిలోనూ పలువురు భారతీయులు ఉన్నారని, వారి పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదిస్తున్నామని కువైట్లో భారత దౌత్యవేత్త సునీల్ జైన్ చెప్పారు. కుటుంబసభ్యుల కోరిక ప్రకారం హుస్సేన్, అబ్బాస్ల మృతదేహాలకు ఇరాక్లోని పవిత్ర నజాఫ్ నగరంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కాగా, మసీదులో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాది సౌదీ అరేబియా జాతీయుడని తెలిసింది.