
న్యూఢిల్లీ: ముంబైలోని వ్యూహాత్మక పశ్చిమ నావికా కమాండ్‌లో 26 మంది నేవీ సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. భద్రతాదళాల్లో కరోనా వైరస్ సోకడం ఇదే తొలిసారి. ఐఎన్‌ఎస్ ఆంగ్రేలో పనిచేస్తోన్న వీరంతా నేవీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఐఎన్‌ఎస్ ఆంగ్రే పరిసరప్రాంతాల్లో ఉన్న వారందరికీ కోవిడ్ పరీక్షలు జరిపినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ విషయాలను రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర ఉన్నతాధికారులకీ తెలియజేశారనీ, వారు ఈ పరిస్థితిపై దృష్టిపెట్టినట్టు అధికారులు వెల్లడించారు. వెస్ట్రన్ నావెల్ కమాండ్ అనేది అరేబియా సముద్రం, హిందూమహాసముద్ర తీర రక్షణకు సంబంధించిన వ్యూహాత్మక విభాగం..
భద్రతాదళాల రక్షణకు చర్యలు
పదిహేను లక్షల భద్రతాదళాల రక్షణకు పటిష్ట చర్యలు చేపడతామని సైనికవర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే త్రివిధ దళాల్లోని కీలకమైన విభాగాలు మినహా, అన్ని యూనిట్లలో సంపూర్ణ లాక్‌డౌన్ కొనసాగుతున్నట్టు వారు తెలిపారు. ఆర్మీ ప్రధాన కార్యాలయం, కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఏప్రిల్ 19 నుంచి మే3 వరకు 50 శాతం సిబ్బందితోనే పనిచేసేలా చర్యలు చేపడుతున్నట్టు ఆదేశాలు జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment