తిరుచానూరు (చిత్తూరు): సులభంగా డబ్బు సంపాదించి సుఖంగా జీవించాలన్నది వారి ఆశ. అందుకోసం ద్విచక్ర వాహనాలను తస్కరించడం మొదలుపెట్టారు. రెండేళ్లలో సుమారు 30 వరకు ద్విచక్ర వాహనాలను కొట్టేసి వాటిని తమిళనాడులోని తమ స్వగ్రామం గురువరాజుపేటలో దాచిపెట్టారు. మంగళవారం చిత్తూరు జిల్లా తిరుపతికి వస్తుండగా.. పూడిరోడ్డు, పాడిపేట క్రాస్‌రోడ్డు వద్ద పోలీసుల తనిఖీల్లో వీరు పట్టుబడ్డారు. బి.ఉమాశంకర్, పి.తిరునావక్కరసు, ఎన్.వెంకటేశన్ తదితర నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి నిజాలను కక్కించి, బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
దొంగలించిన 30 మోటారు సైకిళ్లను ఒకే సారి చెన్నైలో అమ్మి సొమ్ము చేసుకోవాలన్న ఆలోచనతో నిందితులు వాటిని తమ స్వగ్రామంలో దాచి ఉంచినట్టు వెల్లడైంది. దీంతో తమిళనాడుకు వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందం చోరీకి గురైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.