సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని యెలహంక వైమానిక స్థావరంలో జరుగుతున్న ఏరో ఇండియా షోలో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. నాలుగో రోజైన శనివారం పార్కింగ్ ప్రదేశంలో మంటలు చెలరేగి 300కుపైగా సందర్శకుల కార్లు బుగ్గిపాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి అసలు కారణం తెలియరాలేదు. ఎవరో సిగరెట్ కాల్చడం వల్ల మంటలు చెలరేగాయని, ఓ కారులోని సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ నెల 19న రెండు సూర్యకిరణ్ విమానాలు ఢీకొని పైలట్ మృతిచెందిన ఘటనను మరువక ముందే ఈ ప్రమాదం జరిగింది. కార్లు దగ్ధం కావడంపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు హోం మంత్రి ఎంబీ పాటిల్ చెప్పారు.
ఎండ, గాలితో వేగంగా విస్తరించి..
తొలి మూడు రోజులు అధికారులు, వ్యాపారులు, మీడియా ప్రతినిధులు, ఇతర ప్రముఖులకు మాత్రమే పరిమితమైన ఏరో షోలో శనివారం సామాన్య ప్రజలను అనుమతించారు. నాలుగో శనివారం సెలవు దినం కావడంతో ప్రదర్శనకు భారీ ఎత్తున సందర్శకులు తరలివచ్చారు. ఎయిర్‌బేస్‌లోని అన్ని గేట్లు, పార్కింగ్ ప్రదేశాల్లో కార్లు కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం 12గంటలవేళ ఐదో నంబర్ గేట్ పార్కింగ్ ప్రాంతంలో అగ్నికీలలు ప్రారంభమయ్యాయి. ఎండ, గాలి తోడవడంతో క్షణాల్లోనే మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించాయి. పార్కింగ్ ప్రాంతంలోని ఒక్కొక్క కారుకు మంటలు అంటుకుంటూ మొత్తం 300కు పైగా కార్లు కళ్లెదుటే కాలిపోయాయి.
కార్లలోని ఇంధనం అగ్నికి ఆజ్యం పోసింది. ఎగిసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ పరిసర ప్రాంతాల్లో వ్యాపించడంతో సందర్శకులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 15 ఫైరింజన్లతో మంటలను ఆర్పారు. ప్రమాదం నేపథ్యంలో సుమారు రెండు గంటల పాటు ఏరో షోలో ప్రదర్శన, వైమానిక విన్యాసాలు, తదితర కార్యక్రమాలను అధికారులు నిలిపేశారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు పునరుద్ధరించారు.
విలపించిన యజమానులు..
సందర్శకుల్లో చాలామంది తమ కార్లు కళ్ల ముందే కాలిపోతుంటే చూడలేక కన్నీటి పర్యంతమయ్యారు. కార్లలో ఉంచిన విలువైన వస్తువులు, పత్రాలు కూడా బూడిదైనట్లు కొందరు విలపిస్తూ చెప్పారు. అప్పులు చేసి మరీ కారు కొన్నామని, ఇప్పుడేం చేయాలో దిక్కుతోచడం లేదని కొందరు వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment