న్యూఢిల్లీ/జైపూర్/భోపాల్/అహ్మదాబాద్: రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలను మంగళవారం రాత్రి భారీ అకాల వర్షాలు కుదిపేశాయి. దీంతో నాలుగు రాష్ట్రాల్లో కలిపి 53 మంది మరణించారని అధికారులు బుధవారం వెల్లడించారు. రాజస్తాన్, గుజరాత్‌ల్లో భారీగా ఆస్తి, పంట నష్టం కూడా సంభవించిందన్నారు. వర్షం కారణంగా అత్యధికంగా రాజస్తాన్‌లో 25 మంది, మధ్యప్రదేశ్‌లో 15 మంది, గుజరాత్‌లో 10 మంది, మహారాష్ట్రలో ముగ్గురు చనిపోయారు. గుజరాత్‌లో అకాల వర్షాలు, తద్వారా సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ట్విట్టర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిధి నుంచి గుజరాత్‌లో మృతుల కుటుంబీకులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేíషియా ప్రకటించారు. దీంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాలుగు రాష్ట్రాల్లో ప్రజలు చనిపోతే మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ గురించి మాత్రమే పట్టించుకుంటున్నారనీ, ఆయన దేశానికి ప్రధానా లేక గుజరాత్‌కు మాత్రమేనా అని ప్రశ్నించారు. అనంతరం ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ట్వీట్ చేస్తూ మధ్యప్రదేశ్, రాజస్తాన్, మణిపూర్‌ల్లోనూ చనిపోయిన వారి బంధువులకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు సాయం అందించనున్నట్లు ప్రకటించింది.
రాజస్తాన్ మరో రూ. 4 లక్షల సాయం..
వర్షాల వల్ల మరణించిన వారి బంధువులకు రాష్ట్ర ప్రభుత్వాల తరఫున రాజస్తాన్ ప్రభుత్వం రూ. 4 లక్షలు, గుజరాత్ ప్రభుత్వం రూ. 2 లక్షల నష్ట పరిహారం ప్రకటించాయి. రాజస్తాన్‌లో పంటనష్టాన్ని అంచనా వేస్తున్నామనీ, కొన్ని పశువులు కూడా మరణించాయని అధికారులు చెప్పారు. పంట నష్టానికి కూడా ప్రభుత్వం పరిహారం ప్రకటించాలని బీజేపీ ఎమ్మెల్యే ఓం బిర్లా డిమాండ్ చేశారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ మృతులకు ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు గుజరాత్‌లో భారీ వర్షాలకు గాలి దుమారం కూడా తోడైంది. పలుచోట్ల వడగళ్ల వాన కూడా కురిసింది. హిమ్మత్‌నగర్ పట్టణంలో మోదీ సభ కోసం ఏర్పాటు చేసిన సామగ్రి కూడా దెబ్బతింది. పంట నష్టంపై సర్వే చేసి నిర్ణయం తీసుకుంటామని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తెలిపారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మరణించారు. ప్రభావిత ప్రాంతాలకు చేతనైన సాయం చేస్తామని హోం మంత్రి రాజ్‌నాథ్ హామీనిచ్చారు.
24 గంటల్లో ఉత్తర భారతంలో వర్షాలు..
రానున్న 24 గంటల్లో ఉత్తర భారతదేశంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం అంచనావేసింది. మరోవైపు, అరేబియా సముద్రంలో ఏర్పడిన పరిస్థితుల వల్ల పంజాబ్, హరియాణా, ఢిల్లీ, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, జార్ఖండ్, బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది. వాయవ్య భారతంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఆ విభాగం పేర్కొంది.
వర్షాలపై రాజకీయాలొద్దు: మోదీ
వర్షాల కారణంగా నాలుగు రాష్ట్రాల్లో మరణాలు సంభవించినా మోదీ గుజరాత్‌కు మాత్రమే సాయం చేస్తున్నారంటూ కమల్‌నాథ్ చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. అకాల వర్షాలపై రాజకీయాలు చేయవద్దని ఆయన పార్టీలను కోరారు. గుజరాత్‌లోని సబర్‌కాంఠా జిల్లాలో మోదీ మాట్లాడుతూ ‘ఈ విషాద సమయాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని నేను పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. విషాదంలో ఉన్నవారికి మనం సాయం చేయాలి. వర్షాల వల్ల నష్టపోయిన వారికి సాంత్వన చేకూర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి’ అని అన్నారు.
అస్సాంలో రైలుపట్టాలపై పడిన చెట్లను తొలగిస్తున్న స్థానికులు
అకాల వర్షాల బీభత్సం
Published Thu, Apr 18 2019 12:59 AM | Last Updated on Thu, Apr 18 2019 12:59 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment