
95గంటల టూర్.. 33గంటలు ఫ్లైట్‌లో మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ అంకితభావం చూస్తే మీరు అవాక్కవ్వాల్సిందే. ఆయన పెట్టుకున్న షెడ్యూల్‌కోసం తప్ప ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయడం తనకు అస్సలు ఇష్టం ఉండదని ఆయన మరోసారి నిరూపించారు. విజయవంతంగా మూడు విదేశాంగ పర్యటనలు ముగించుకొని ప్రధాని నరేంద్రమోదీ బుధవారం ఉదయం ఢిల్లీలో అడుగుపెట్టారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ వెళ్లే సమయంలో ఎంత హుషారుగా ఉన్నారో అంతకుమించిన ఆనందంతో కనిపించారు. ఈ నాలుగు రోజుల పర్యటనలో ఆయన ఎక్కడ కూడా పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోలేదు. మరుసటి రోజు ఏదైనా ప్రోగ్రాం ఉంటే తప్ప ఆయన బస చేయలేదు. పోర్చుగల్, నెదర్లాండ్‌లో ఒక్కోరోజులోనే తన పర్యటనను పూర్తి చేసిన మోదీ అమెరికాలో మాత్రం రెండు రోజులు పర్యటించారు.
మొత్తం 95గంటలపాటు సాగిన ఆయన టూర్‌లో 33గంటలు ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో ప్రయాణించారు. పోర్చుగల్, అమెరికా, నెదర్లాండ్‌లో కలిపి వరుసగా 33 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జూన్ 24న ఉదయం 7గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి లిస్బాన్ పదిగంటల్లో వెళ్లిన మోదీ అక్కడ కనీసం హోటల్ కూడా తీసుకోకుండా అక్కడి ఎయిర్‌పోర్ట్‌లోనే వీవీఐపీ లాంజ్‌లో విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత నేరుగా పోర్చుగల్ విదేశాంగ కార్యాలయానికి వెళ్లి కలిశారు. అనంతరం చంపాలిమౌడ్ ఫౌండేషన్ వద్దకు వెళ్లి అక్కడి భారతీయులను కలిసి అక్కడి నుంచి నేరుగా సాయంత్రం 6గంటలలోపు తిరిగి వాషింగ్టన్ బయల్దేరేందుకు లిస్బాన్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. అక్కడి నుంచి ఎనిమిదిగంటలపాటు ప్రయాణించి భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 4గంటలలోగా వాషింగ్టన్ చేరుకున్నారు. మొత్తం ఆయనతో కలిసి ప్రయాణీంచిన భారతీయ బృందం 50మంది విల్లార్డ్ కాంటినెంటల్ హోటల్‌లో దిగగా.. మోదీ రెండు రోజుల్లో అమెరికాలో 17 కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అమెరికా సీఈవోలతో సమావేశం, ట్రంప్‌తో భేటీ తదితర కార్యక్రమాలు ఇందులో అత్యంత ముఖ్యమైనవి. అయితే, సోమవారం రాత్రి 9గంటలకు తన అమెరికా పర్యటన పూర్తికావడంతో ఆ రాత్రి అక్కడే ఉండకుండా ఆ సమయంలోనే నేరుగా నెదర్లాండ్ పర్యటన ప్రారంభించారు. నేరుగా అక్కడికి వెళ్లిన ఆయన మొత్తం ఏడు కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. అనంతరం అక్కడి నుంచి డచ్ కాలమానం ప్రకారం రాత్రి ఏడుగంటలకు బయల్దేరిన ప్రధాని మోదీ బుధవారం 6గంటల వరకు భారత్‌కు చేరుకున్నారు. ఈ విధంగా తన టూర్‌లో ఏ మాత్రం విశ్రాంతి తీసుకోకుండా మోదీ తన పర్యటనను విజయవంతంగా ముగించారు.