
న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు 372 సంస్కరణలను గుర్తించినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. రాష్ట్రాలు వీటిని యుద్ధప్రాతిపదికన అమలు చేయాల్సి ఉంటుందని, నిర్మాణాత్మకంగా ఒకదానితో మరొకటి పోటీపడాలని సూచించారు. ఈ విషయంలో ఆయా రాష్ట్రాల పనితీరుపై కేంద్రం ఎప్పటికప్పుడు పారిశ్రామిక వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తుందని తెలిపారు.
వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం ద్వారా మరిన్ని పెట్టుబడులు ఆకర్షించవచ్చని, ఇన్వెస్టర్లకు అనుకూల పరిస్థితులు కల్పించ వచ్చని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 2016 ‘ఆలిండియా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. ప్రపంచ బ్యాంకు ఇటీవలే విడుదల చేసిన వ్యాపారాలకు అనువైన 190 దేశాల జాబితాలో భారత్ 30 స్థానాలు ఎగబాకి 100వ ర్యాంకుకు చేరుకున్న తెలిసిందే. భవిష్యత్తులో టాప్ 50లోకి చేరాలని లక్ష్యంగా నిర్దేసించుకున్నట్లు జైట్లీ వెల్లడించారు.