
సభలు 4.. సీట్లు 3
మోదీ హైస్పీడ్‌కు బ్రేక్
ఢిల్లీ కమలానికి మిగిలింది మూడే సీట్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ మోదీ ప్రచారం చేసిన సభల సంఖ్య మేరకైనా బీజేపీకి సీట్లు దక్కలేదు. సుడిగాలిలాగా నాలుగు ర్యాలీలలో నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం చేశారు. ప్రధానంగా ఆమ్‌ఆద్మీపార్టీని లక్ష్యం చేసుకున్నారు. 16 సంవత్సరాల తరువాత రాజధాని అభివృద్ధి పథంలో నడిచే సమయం వచ్చిందన్నారు. కానీ ఈ మాటలేవీ ఓటర్ల చెవికెక్కలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడీ తో సహా మహామహులందరినీ చీపురుతో ఊడ్చేశారు. చావుతప్పి కన్నులొట్టపోయినట్లు మూడే మూడు సీట్లు దక్కించుకుని టీమ్ మోదీ ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. రోహిణి నియోజక వర్గం నుంచి విజేందర్ గుప్తా, విశ్వాస్ నగర్ నుంచి ఓం ప్రకాశ్ శర్మ, ముస్తఫాబాద్ నుంచి జగ్‌దీశ్ ప్రధాన్‌లు మాత్రమే గెలుపు సర్టిఫికేట్లు అందుకున్నారు. రోహిణి నియోజకవర్గంలో విజేందర్ గుప్తా ఆప్ అభ్యర్థి సీఎల్ గుప్తాపై 5,367 ఓట్ల తేడాతో గెలిచారు.
ముస్తఫాబాద్‌లో జగదీశ్ ప్రధాన్ కాంగ్రెస్ అభ్యర్థి హసన్ అహ్మద్‌పై 6,031 ఓట్ల మెజారిటీతో విజయం పొందారు. ఇక్కడ ఆప్ మూడో స్థానంలో నిలిచింది. ఇక విశ్వాస్‌నగర్ నుంచి ఓం ప్రకాశ్ శర్మ ఆప్ అభ్యర్థి అతుల్ గుప్తాపై దాదాపు 10వేల ఓట్ల మెజారిటీ సాధించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దింపిన కిరణ్‌బేడీ, ఇరవైఏళ్లుగా బీజేపీ కంచుకోటగా ఉన్న కృష్ణానగర్ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి ఎస్‌కే బగ్గాపై బేడీ 2,277 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికలకు ముందు బీజేపీలోకి దూకిన కాంగ్రెస్ సీనియర్ నేత కృష్ణ తీరథ్ పటేల్ నగర్‌లో, జనక్‌పురిలో బీజేపీ సీనియర్ నేత జగదీశ్ ముఖీ, బదర్‌పూర్ నుంచి రామ్‌వీర్‌సింగ్ బిధురీలు ఓడిపోయారు. కేజ్రీవాల్‌పై పోటీకి దిగిన నుపుర్ శర్మ ఘోరంగా ఓడిపోయారు. సీనియర్ ఆప్ నేత మనిష్ సిసోడియా.. తన పాత సహచరుడు వినోద్ కుమార్ బిన్నీపై పట్‌పర్‌గంజ్‌లో తిరుగులేని ఆధిక్యంతో గెలుపొందారు. కాగా, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడీపై విజయం సాధించిన ఎస్‌కే బగ్గా బేడీ స్థానికురాలు కారనిఅన్నారు.