బెంగళూరు: కర్ణాటకలో రెండోసారి ఇంటర్ కెమిస్ట్రీ పేపర్ లీక్ అయిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఇందుకు సంబంధించి 40 మంది అధికారులపై ఇంటర్ బోర్డు గురువారం వేటు వేసింది. గురువారం జరగాల్సిన కెమిస్ట్రీ పరీక్ష పేపర్ లీక్ పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మీడియాతో మట్లాడారు. దీనికి సంబంధించి ఇంటర్ బోర్డు అధికారులను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. గురువారం జరగాల్సిన పరీక్షను రద్దుచేసి తిరిగి ఏప్రిల్ 12న నిర్వహించనున్నట్టు ప్రకటించారు.
కర్ణాటకలో వరుసగా పరీక్ష పేపర్లు లీక్ అవుతున్నాయి. పదిరోజుల్లో రెండోసారి ఇంటర్ కెమిస్ట్రీ పేపర్ లీక్ అయింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలో పడ్డారు. వరుసగా రెండవసారి పరీక్ష ఆగిపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. రాజధాని నగరం బెంగళూరు సహా, వివిధ జిల్లాల్లో వందలాదిమంది విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తూ ఆందోళనకు దిగారు.
కాగా ఈ నెల 21న ఇదే పేపర్ లీక్ కావడంతో పరీక్షను రద్దు చేసి మార్చి 31న పరీక్ష నిర్వహించేందుకు నిర్ణయించారు. రెండవసారి కూడా అదే సీన్ రిపీట్ కావడం ఆందోళన రేపింది. మళ్లీ పేపర్ లీక్ అయిందన్న సమాచారం అందిన వెంటనే పీయూ బోర్డ్ డైరెక్టర్ పల్లవి ఆకృతి పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు పేపర్ లీకేజీకి బాధ్యత వహించి విద్యాశాఖమంత్రి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.