కశ్మీర్‌లో ఆపరేషన్ ‘కామ్ డౌన్’
లోయలో మంటలు చల్లార్చడానికి 4000 జవాన్లు
శ్రీనగర్/న్యూఢిల్లీ: అట్టుడుకుతున్న హింస... ఉగ్రవాదుల కదలికలు... కల్లోలంగా మారిన కశ్మీర్‌ను కుదుట పరచడానికి భారత సైన్యం ఆపరేషన్ ‘కామ్ డౌన్’ను ప్రారంభించింది. ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులను ఏరివేసి సాధారణ పరిస్థితులు కల్పించడానికి దక్షిణ కశ్మీర్‌లో 4,000 అదనపు జవాన్లను గుట్టుచప్పుడు కాకుండారంగంలోకి దింపింది. అయితే కనీస బలగాలను మాత్రమే ఉపయోగించాలని వారికి కచ్చితమైన ఆదేశాలున్నట్టు అధికారులు తెలిపారు. జనజీవనానికి విఘాతం కలిగిస్తున్న ఆందోళనకారులను కట్టడి చేయడానికి వీరిని నియోగించారు. పుల్వామా, షోపియన్, అనంత్‌నాగ్, కుల్గామ్ జిల్లాల్లో బలగాలు దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో సీఆర్‌పీఎఫ్, స్థానిక పోలీసుల సహకారంతో సైన్యం దక్షిణ కశ్మీర్‌ను జల్లెడ పడుతోంది. అల్లర్లను మరింతగా రెచ్చగొట్టడానికి వంద మంది ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర్‌లోకి చొరబడినట్టు సమాచారం.
బక్రీద్‌నాడు ఘర్షణలు... ఇద్దరు మృతి
బక్రీద్‌నాడు లోయలో జరిగిన ఘర్షణల్లో ఇద్దరు యువకులు మరణించారు. అలర్ల నేపథ్యంలో 200 ఏళ్ల తరువాత జమా మసీద్ మూతపడింది. 1821 తరువాత ఇక్కడ బక్రీద్ ప్రార్థనలు జరగకపోవడం ఇదే తొలిసారి.
బక్రీద్ కశ్మీరీల త్యాగాలకు అంకితం: నవాజ్ షరీఫ్
లాహోర్: బక్రీద్(ఈద్ ఉల్ అజా)ను కశ్మీరీల త్యాగాలకు అంకితమిస్తున్నానని పాక్ ప్రధాని నవాజ షరీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి స్వాత ంత్య్రం కోసం మూడోతరం కశ్మీరీలూ మహోన్నతమైన త్యాగాలకు సిద్ధపడుతున్నారని బక్రీద్ సందేశంలో పేర్కొన్నారు. భారత్ వారిపై అణచివేతలకు పాల్పడుతున్నా ఎదురొడ్డి పోరాడుతున్నారన్నారు.