‘పఠాన్ కోట్’పై పాక్ దర్యాప్తు | Pakistani probe on the 'Pathankot' | Sakshi
Sakshi News home page

‘పఠాన్ కోట్’పై పాక్ దర్యాప్తు

Published Sat, Jan 9 2016 1:50 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM

‘పఠాన్ కోట్’పై పాక్ దర్యాప్తు

‘పఠాన్ కోట్’పై పాక్ దర్యాప్తు

పాక్ ప్రభుత్వ ప్రకటన
భారత్ అందించిన ఆధారాలపై విచారణ.. చర్చలపై ఆశాభావం

 
 ఇస్లామాబాద్/పఠాన్‌కోట్: తమ సరిహద్దుకు దగ్గర్లోని పంజాబ్‌లో పఠాన్‌కోట్ భారత వైమానిక దళ స్థావరంపై ఉగ్రాదాడికి సంబంధించి  భారత్ అందించిన సాక్ష్యాధారాలపై దర్యాప్తును సమీక్షించినట్లు పాక్ ప్రకటించింది. పఠాన్‌కోట్ దాడులపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ శుక్రవారం వరుసగా రెండోరోజు ఉన్నతస్థాయి భేటీ నిర్వహించారు. ఈ ప్రాంతం నుంచి ఉగ్రవాదాన్ని తరిమేసే దిశగా భారత్‌తో కలిసి పాక్ పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో భారత ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగించాలని నిర్ణయించినట్లు భేటీ అనంతరం పాక్ పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. ఇరుదేశాల మధ్య ఇటీవల చర్చలతో నెలకొన్న సానుకూల వాతావరణం నేపథ్యంలో.. చర్చల ప్రక్రియకు ఇరుదేశాలు కట్టుబడి ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

‘పాక్ గడ్డను ఉగ్రచర్యలకు వాడే అందరు ఉగ్రవాదులు, అన్ని ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టే విషయంలో పాక్ ప్రజలు, ప్రభుత్వం కట్టుబడి ఉంద’ని అందులో పేర్కొంది.భేటీలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్, విదేశీ వ్య వహారాల్లో ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్, జాతీయ భద్రత సలహాదారు నాసర్ ఖాన్ జంజువా, ఐఎస్‌ఐ డీజీ రిజ్వాన్ అఖ్తర్, విదేశాంగ కార్యదర్శి అయిజాజ్ అహ్మద్ చౌధురి పాల్గొన్నారు. సాక్ష్యాధారాలను అందిస్తూ.. ఉగ్ర దాడి వెనకున్న వారిపై సాధ్యమైనంత త్వరగా, కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా భారత్ డిమాండ్ చేయడం తెలిసిందే. గురువారం కూడా షరీఫ్ ఇస్లామాబాద్‌లో  ఉన్నత స్థాయి భేటీ నిర్వహించారు.

అనంతరం.. పఠాన్‌కోట్ ఉగ్రదాడిపై దర్యాప్తునకు పాక్ ప్రభుత్వం ఆదేశించింది. భారత్ అందించిన సాక్ష్యాధారాలను ఆ భేటీలో ఐబీ చీఫ్ అఫ్తాబ్ సుల్తాన్‌కు అందించారు.  వాటిపై విచారణ జరపాల్సిందిగా నిఘా విభాగాన్ని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశించినట్లుగా పాక్ మీడియా పేర్కొంది. భారత జాతీయ భద్రతాసలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్‌తో సంప్రదింపులు కొనసాగించాలని తమ దేశ ఎన్‌ఎస్‌ఏ జంజువాను షరీఫ్ ఆదేశించారు. దాడికి సంబంధించి భారత్ కొన్ని ఫోన్ నంబర్లు మాత్రమే ఇచ్చిందని, మరింత సమాచారం కావాలని భారత్‌ను కోరే అవకాశముందని ఓ అధికారి తెలిపారు. దాడి పూర్వాపరాలపై పాక్ సత్వరం సమగ్ర, నిష్పక్షపాత, పారదర్శక దర్యాప్తు జరపాలని అమెరికా అభిలషించింది.

 కూంబింగ్ ముగిసింది.. మరోవైపు, పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలో కూంబింగ్ ముగిసింది. అక్కడి విశాల ఆవరణాన్నిమూడు రోజులుగా ఆర్మీ, ఎన్‌ఎస్‌జీ, వైమానికదళానికి చెందిన గరుడ కమెండోలు జల్లెడబట్టారు. ఉగ్రవాదులెవరూ దాగిలేరని, ఆయుధాలు, మందుగుండు.. తదితరాలేవీ లేవని నిర్ధారించుకున్నారు. కాగా, సైనిక దుస్తుల్లో ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న వార్తలతో పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్‌లలో హైఅలర్ట్‌ను కొనసాగించారు. పఠాన్‌కోట్ దాడి నేపథ్యంలో పార్లమెంట్ భద్రతను స్పీకర్ సుమిత్రా మహాజన్ సమీక్షించారు. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిందిగా భద్రతాదళాలను ఆదేశించారు.

మరోపక్క.. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండొచ్చని వారి మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు తెలిపారు. వారి శరీరాల్లో 3 నుంచి 10 వరకు బుల్లెట్లున్నాయన్నారు. డీఎన్‌ఏ పరీక్షల కోసం మృతదేహాల నుంచి గోర్లు, దంతాలు తదితరాలను సేకరించారు. ఇద్దరు టైస్టుల మృతదేహాలు పూర్తిగా కాలిపోయి ఉన్నాయన్నారు.

 ప్రజలు ఆర్మీ యూనీఫామ్స్ వాడొద్దు
 ఈ దాడి చేసిన ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చిన నేపథ్యంలో.. సైనికుల తరహాలో వస్త్రధారణ చేయొద్దని పౌరులకు, అలాంటి దుస్తులను అమ్మొద్దని దుకాణదారులకు ఆర్మీ నిబంధనలు జారీ చేసింది. ఇవి దేశవ్యాప్తంగా వర్తిస్తాయంది. పఠాన్‌కోట్ దాడికి ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లోనే వచ్చిన విషయం తెలిసిందే.

 నేడు పఠాన్‌కోట్‌కు మోదీ?
 కాగా ప్రధాని మోదీ శనివారం పఠాన్‌కోఠ్ ఎయిర్‌బేస్‌ను సందర్శించే అవకాశముందని పీఎంఓ వర్గాలు తెలిపాయి.
 
 అనుమానాస్పద ఎస్పీకి ఎన్‌ఐఏ సమన్లు
 పఠాన్‌కోట్ దాడి విషయంలో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న, వివాదాస్పద పంజాబ్ ఎస్పీ సల్వీందర్ సింగ్‌కు ఎన్‌ఐఏ సమన్లు జారీ చేసింది. సమగ్ర విచారణ నిమిత్తం సోమవారం తమ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించిందని సంబంధిత వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఆయనపై సత్య శోధన పరీక్ష నిర్వహించే అవకాశాలున్నాయని వెల్లడించాయి. ఉగ్రదాడి జరిగిన ముందు రోజు ఉగ్రవాదులు కిడ్నాప్ చేయడానికి సంబంధించి సల్వీందర్ నమ్మశక్యం కాని రీతిలో వివరణ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోన్న నేపథ్యంలో ఆయనపై ఎన్‌ఐఏ ప్రధానంగా దృష్టి పెట్టింది. కాగా.. రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడన్న ఆరోపణలపై సల్వీందర్ సింగ్‌పై పంజాబ్ పోలీస్ శాఖ విచారణకు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement