ఎలాంటి సవాలుకైనా సిద్ధం
ఆర్మీ చీఫ్ సుహాగ్ వెల్లడి
♦ పీఓకేలో 17 ఉగ్ర శిబిరాలున్నాయ్
♦ శాంతి ప్రక్రియకు పాక్ సైన్యం తూట్లు
న్యూఢిల్లీ: దేశ భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితి తలెత్తినప్పుడు దానిని దీటుగా ఎదుర్కొనేందుకు ఎలాంటి టాస్క్‌నైనా సమర్థవంతంగా చేపట్టేందుకు సైన్యం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ చెప్పారు. భారత్‌కు నొప్పి కలిగించిన సంస్థలు, వ్యక్తులకు తిరిగి అదే మాదిరి నొప్పి కలిగేలా చేయాలని రెండు రోజుల కిందట రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చెప్పిన నేపథ్యంలో ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నా యి. ఆర్మీ డేని పురస్కరించుకొని సైన్యాధిపతి సుహాగ్ బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలపై కోవర్ట్ దాడులు చేసేందుకు భారత సైన్యానికి సత్తా ఉందా అన్న ప్రశ్నకు, తమకు అప్పగించిన ఎలాంటి పనినైనా సమర్థవతంగా నిర్వహించేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని సుహాగ్ బదులిచ్చారు.
దేశం ఎదుర్కొనే ఎలాంటి సవాల్‌ను అయినా అధిగమించేందుకు సైన్యం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉందన్నారు. పీఓకేలో ఇంకా కనీసం 17 ఉగ్రవాద శిక్షణ శిబిరాలు క్రియాశీలకంగా కొనసాగుతున్నాయని, వీటితో భారత్‌కు భద్రతాపరంగా సవాల్ పొంచి ఉందని చెప్పారు. గతంలో 42 ఉగ్ర శిబిరాలు ఉండేవని, కొన్నేళ్ల క్రితం అంతర్జాతీయ ఒత్తిడితో కొన్నింటిని మూసేశారన్నారు. పంజాబ్‌లోని పాక్ సరిహద్దుల నుంచి దేశంలోకి చొరబాట్లు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తూ, దీనికి సరిహద్దు భద్రతా దళానిదే బాధ్యతని పేర్కొన్నారు.
పఠాన్‌కోట్ దాడిలో పాక్ హస్తముందన్న దానిపై మాట్లాడుతూ, ఉగ్రవాదులు తమ వెంట తెచ్చుకున్న మందులు, ఇతర పరికరాలను బట్టి చూస్తే వారు పాక్ నుంచే వచ్చినట్లు అర్థమవుతోందని సుహాగ్ చెప్పారు. శాంతికి విఘాతం కలిగించేందుకు పాక్ ఆర్మీ, ఐఎస్‌ఐలు పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై దాడికి యత్నించాయా అన్న ప్రశ్నకు, గతంలో ఎన్నోసార్లు పాక్ ఆర్మీ శాంతి ప్రక్రియకు తూట్లు పొడిచిందన్నారు. పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదులను మట్టుబెట్టే ఆపరేషన్‌ను ఎన్‌ఎస్‌జీ కమాండోలకు అప్పగించడం సబబా, కాదా అన్న ప్రశ్నకు, అది సరైన నిర్ణయమేనని చెప్పారు.
కాగా, పఠాన్‌కోట్ ఉగ్రదాడిని విచారిస్తున్న ఎన్‌ఐఏ.. ఉగ్రవాదులు వదిలి వెళ్లిన వాహనం సమీపంలో ఓ చైనా తయారీ వైర్‌లెస్ సెట్‌ను స్వాధీనం చేసుకుంది. వాహనం సమీపంలో క్లూస్ కోసం వెతుకుతుండగా ఈ సెట్ దొరికిందని దీన్ని ఫొరెన్సిక్ లేబొరేటరీకి పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి గురుదాస్‌పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్‌ను ఎన్‌ఐఏ వరుసగా మూడోరోజూ విచారించింది.