మరో విషాదం: 55మంది శిశువులు బలి
ముంబై: గోరఖ్‌పూర్, ఫరూఖాబాద్ మిగిల్చిన విషాదాన్ని మర్చిపోక ముందే మరో ఘోరం వెలుగు చూసింది. వెంటిలేటర్ల కొరత విషాదం శిశువులను వెంటాడుతోంది. మహారాష్ట్ర నాసిక్‌లోని ఒక జిల్లా ఆసుపత్రిలో ఏకంగా 55మంది పసిబిడ్డలు ఆసుపత్రి నిర్లక్ష్యానికి అసువులు బాశారు. ఆక్సిజన్ కొరత, వెంటిలేటర్, ఇతర ఆరోగ్య సౌకర్యాల లోపంతో మరణించడం కలకలం సృష్టించింది. అంతేకాదు గత ఏప్రిల్‌నుంచి అయిదు నెలలకాలంలో 187మంది చనిపోవడం మరింత ఆందోళన రేపింది.
నాసిక్ ప్రత్యేక నవజాత కేర్ యూనిట్లో ఈ ఆగస్టులో సుమారు 350 మంది పిల్లలు ఆసుపత్రిలో చేరగా, వీరిలో 55 మంది పిల్లలు మరణించారు. తమ ఆసుపత్రిలో వెంటిలేటర్ సౌకర‍్యం లేని కారణంగానే ఈ మరణాలు సంభవించాయని ఆసుపత్రి వైద్యులు జీఎం హోలే తెలిపారు.
మరోవైపు శిశువుల మరణాలను ధృవీకరించిన సివిల్ సర్జన్ సురేష్ జగ్దలే ఆసుపత్రి నిర్ల‍్యక్షం ఏమీలేదని వాదించారు. పిల్లలు ప్రీ మెచ్యూర్‌గా పుట్టడం, ఊపిరితిత్తుల బలహీనత లాంటి కారణాల వల్ల కూడా మరణాలు సంభవించాయని జగ్దలే చెప్పారు. గతనెల నుంచి (ఏప్రిల్ నుంచి) 187 మంది శిశువులు మరణించారని తెలిపారు.
అటు రాష్ట్ర ఆరోగ్య మంత్రి దీపక్ సావంత్ సురేష్ జగ్దలేకు మద్దతు పలికారు. దాదాపు చివరి దశలో శిశువును ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. వీటిని నివారించడానికి ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక "ప్రోటోకాల్"ను త్వరలో అమలు చేస్తామని మంత్రి చెప్పారు.
కాగా గత నెలలో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్ పూర్‌లో బి.ఆర్.డి. మెడికల్ కాలేజీలో 70 మందికి పైగా నవజాత శిశువులు, ఫరూఖాబాదులో కనీసం 49 మంది పిల్లలు మరణించిన సంగతి తెలిసిందే.