
సాక్షి, కొహిమా : నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధుల్లో 59 శాతం మంది కోటీశ్వరులేనని ఎన్నికల కమిషన్ (ఈసీ)కు వారు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించగా వెల్లడైంది. 196 మంది అభ్యర్ధుల్లో 193 మంది అభ్యర్ధుల అఫిడవిట్లను పరిశీలించిన అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్ధ వారిలో 114 మంది అభ్యర్ధులు కరోడ్‌పతీలని తేల్చింది. జేడీ(యూ) అభ్యర్థి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లోథా అత్యధికంగా రూ 38.92 కోట్ల ఆస్తులు కలిగిఉన్నారని ఏడీఆర్ పేర్కొంది.
వోఖా జిల్లా సనీస్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. ఇకపెరెన్ సీటు నుంచి నాగా పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న నాగాలాండ్ సీఎం టీఆర్ జెలింగ్ తన ఆస్తులు కేవలం రూ 3.52 కోట్లుగా అఫిడవిట్‌లో పొందుపరిచారు. ఇక ఘస్పానీ సీటు నుంచి పోటీలో నిలిచిన ఆప్ అభ్యర్థి అకవి జిమోమి తనకు ఎలాంటి ఆస్తులు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.కాగా ఫిబ్రవరి 27న నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment