ఘనంగా సినిమా పండుగ
62వ జాతీయ చలనచిత్ర అవార్డులను
ప్రదానం చేసిన రాష్ట్రపతి ప్రణబ్
న్యూఢిల్లీ: 62వ జాతీయ సినిమా అవార్డుల ప్రదానోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. ఆదివారమిక్కడ విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందజేశారు. చిత్రరంగంపై ఉత్తమ రచన(సెలైంట్ సినిమా)కుగాను రచయిత పసుపులేటి పూర్ణచంద్రరావు, ప్రచురణ కర్త ఎమెస్కో విజయ్‌కుమార్‌లు రాష్ట్రపతి చేతుల మీదుగా స్వర్ణకమలం, ప్రశంసాపత్రం అందుకున్నారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా తెలుగు భాష నుంచి ఎంపికైన ‘చందమామ కథలు’ సినిమా నిర్మాత చాణక్య బోనేటి, దర్శకుడు ప్రవీణ్ సత్తారు రాష్ట్రపతి చేతుల మీదుగా రజత కమలం, ప్రశంసా పత్రాలు స్వీకరించారు.
ఉత్తమ నటుడు (నాను అవనల్లా అవాలు-కన్నడ చిత్రం)గా ఎంపికైన విజయ్, ఉత్తమ నటి(క్వీన్)గా ఎంపికైన బాలీవుడ్ తార కంగనా రనౌత్, ఉత్తమ దర్శకుడు(చోటుష్‌కొనే-బెంగాలీ చిత్రం)గా ఎంపికైన శ్రీజిత్ ముఖర్జీలు కూడా అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మం త్రులు అరుణ్‌జైట్లీ, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఆనారోగ్యం కారణంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకునేందుకు ప్రముఖ నటుడు శశికపూర్ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. భారతసినీ రంగానికి కపూర్ కుటుంబం చేసిన సేవలను రాష్ట్రపతి ఈ సందర్భంగా కొనియాడారు. ఆయన్ను ‘లివింగ్ లెజెండ్’గా అభివర్ణిస్తూ.. త్వరగా కోలుకోవాలని అభిలషించారు. శశికపూర్‌కు ఆయన నివాసంలోనే ప్రభుత్వం తరఫున పురస్కారాన్ని అందజేసి గౌరవిస్తామని జైట్లీ వెల్లడించారు.