సమరయోధుల త్యాగఫలం
ప్రస్తుతం మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం ఎంతో మంది సమరయోధుల త్యాగ ఫలమని ముఖ్యమంత్రి జయలలిత పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జయలలిత శుక్రవారం జార్జికోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి, వందనం చేశారు. ఆమె ప్రసంగిస్తూ స్వతంత్ర భారతావనిలో జాతీయ జెండా ఎగురవేసే అదృష్టం తనకు దక్కినందుకు సంతోషిస్తున్నానని చెప్పారు. స్వాతంత్య్ర ఫలాలు అట్టడుగు వారికి దక్కేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సమరయోధులకు రాష్ర్ట ప్రభుత్వం అందజేస్తున్న వేతనాన్ని పెంచుతూ వారికి స్వాతంత్య్ర దినోత్సవ కానుక ప్రకటించారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: బ్రిటీష్ కర్కశుల కాళ్ల కింద నలిగిపోవాల్సిన పరిస్థితి నుంచి జాతికి విముక్తి కల్పించిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగనిరతిని మరువరాదని ముఖ్యమంత్రి జయలలిత పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సమరయోధులకు కృతజ్ఞతాభావ దినంగా భాసిల్లాలని ఆమె పేర్కొన్నారు. చెన్నై జార్జికోట నుంచి శుక్రవారం జాతీయపతాకాన్ని సీఎం జయలలిత ఎగురవేశారు. ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, వందల ఏళ్లపాటూ విదేశీయుల కబంధ హస్తాల్లో ఉన్న భారతదేశానికి విముక్తి కల్పించడంలో ఎందరో భారతీయులు ప్రాణాలు అర్పించారని గుర్తుచేశారు. అంతటి గొప్ప చరిత్ర కలిగిన భారతావని భూభాగం నుంచి జాతీయపతాకాన్ని ఎగురవేసే అదృష్టం తనకు దక్కినందుకు అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతున్నానని అన్నారు.
ప్రజలందరికీ స్వాతంత్య్ర ఫలాలు: మహామహులు ఆర్జించిపెట్టిన స్వాతంత్య్ర ఫలాలు అట్టడుగు ప్రజానీకానికి సైతం అం దేలా తన ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. తన హయూం లో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేద, బడుగు, బలహీన వర్గాల వారికోసం ప్రవేశపెట్టానని చెప్పారు. ప్రతి రేషన్‌కార్డు దారునికి ఉచితంగా 20 కిలోల బియ్యం, 35.38 లక్షల మందికి రూ.1000 నెలవారీ పెన్షన్, ఉచితంగా మిక్సీ, గ్రైండర్, టేబుల్‌ఫ్యాన్ అందజేస్తున్నట్లు చెప్పారు. పేదింటి యువతుల వివాహం కోసం 4 గ్రాముల బంగారు తాళిబొట్టుతోపాటూ రూ.50వేల ఆర్థిక సాయం అందజేస్తున్నామని అన్నారు.
అరసు కేబుల్ ద్వారా కేవలం రూ.70కే డిజిటల్ టీవీ ప్రసారాలు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. అమ్మ క్యాంటీన్లు, అమ్మ ఫార్మసీలు, అమ్మ అముదం దుకాణాలు, అమ్మ మినరల్ వాటర్ ఇలా ఎన్నో పథకాలు పేదలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టినవేనని చెప్పారు. ఇక ఉన్నత విద్యను పేదలకు అందుబాటులోకి తేవడంలో ఒక విప్లవాన్నే సృష్టించినట్లు తెలిపారు. పాఠశాల విద్యకు మాత్రమే ఈ సంవత్సరం రూ.19,634 కోట్లు కేటాయించినట్లు ఆమె తెలిపారు. 2011-12 సంవత్సరంలో 101.52 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులతో రికార్డు నెలకొల్పామని చెప్పారు. 2013-14లో 110.65 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకున్నట్లు చెప్పారు.
సరైన సత్కారం: దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలొడ్డి పోరాడిన వారికి ప్రభుత్వం అందించే గౌరవవేతనాన్ని పెంచడమే వారికి సరైన సత్కారంగా భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. సమరయోధులకు ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనం రూ.9వేలను రూ.10వేలకుపెంచుతున్నట్లు తెలిపారు. వారి కుటుంబాలకిచ్చే వేతనాన్ని రూ.4,500 నుంచి రూ.5 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. తద్వారా 1955 మంది లబ్ధి పొందితే రాష్ట్ర ఖజానాకు రూ.1.43కోట్ల భారం పడుతుందన్నారు.
జెండా వందనం: స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనేందుకు సీఎం జయలలిత శుక్రవారం ఉదయం 8.30 గంటలకు పోయెస్‌గార్డెన్ లోని తన ఇంటి నుంచి బయలుదేరారు. మార్గమధ్యంలో ఉన్న సైనిక స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అక్కడి నుంచి 12 మోటార్ సైకిళ్లపై పోలీసు జవాన్లు ముఖ్యమంత్రి ముందు వెళుతుండగా జార్జికోట (సచివాలయం)కు చేరుకున్నారు.
సచివాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్‌వర్గీస్ సీఎంకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. త్రివిధ దళాలకు చెందిన అధికారులను సీఎస్ ఆమెకు పరిచయం చేశారు. అనంతరం టాప్‌లేని జీపులో ప్రయాణిస్తూ గౌరవవందనం స్వీకరించా రు. ఆ తరువాత జార్జికోటపై భాగానికి వెళ్లి సరిగ్గా ఉదయం 9 గంటలకు జాతీయపతాకాన్ని ఎగురవేశారు. ప్రజలను, అధికారులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన అధికారులు, విద్యార్థులు, స్వచ్చంద సేవాసంస్థల వారికీ అవార్డులను, ప్రత్యేక ప్రతిభావంతులకు పరికరాలను ఆమె పంపిణీ చేశారు.