69 ఏళ్ల చరిత్ర.. గుర్మీత్ బాధ్యతలు చేపట్టాకే వివాదాలు
మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తరించిన డేరా సచ్ఛా సౌదా(డీఎస్‌ఎస్)కు 69 ఏళ్ల చరిత్ర ఉంది. డీఎస్‌ఎస్‌కు గుర్మీత్ నాయకత్వం చేపట్టినప్పటి నుంచి దీని నడక కొత్త పుంతలు తొక్కింది.
డేరాల నేపథ్యం
హిందూ ఆశ్రమాల మాదిరిగా పనిచేసే ఆధ్యాత్మిక కేంద్రాలను అవిభక్త భారత్‌లోని పంజాబ్, సింధ్, ఫక్తూనిస్తాన్‌లలో డేరాలుగా పిలుస్తారు. పంజాబ్‌లో అతిపెద్దది, మొదటిది అయిన డేరా రాధాస్వామీ సత్సంగ్ బియాస్‌ను 1891లో ప్రారంభించారు. పంజాబ్, హరియాణాలో 9000కుపైగా డేరాలున్నాయని ఓ అంచనా. డేరా రాధాస్వామీ సత్సంగ్‌తోపాటు డీఎస్‌ఎస్, డేరా నూర్మహల్, డేరా సచ్‌ఖండ్ బలాన్, డేరా నిరంకారీ, డేరా నాంధారీ ఎక్కువ మంది అనుచరులున్న డేరాలు. రోజూవారీ జీవితంలో తాము ఎదుర్కొంటున్న అగ్రవర్ణాల ఆధిపత్యం డేరాల్లో లేకపోవడం బడుగువర్గాలకు నచ్చింది. తమకు తాముగా పీఠాధిపతిగా ప్రకటించుకుని, భక్తుల కోసం ప్రసంగాలు, ప్రవచనాలు చేసే గురువులు, బాబాలు ఈ ప్రాంతంలో 19వ శతాబ్దం నుంచి డేరాలు ప్రారంభించారు.
డీఎస్‌ఎస్ స్థాపన, విస్తరణ..
మస్తానా బలూచీ అనే క్షత్రియ సన్యాసి అవిభక్త పంజాబ్ (ప్రస్తుత హరియాణా)లోని సిర్సాలో డీఎస్‌ఎస్‌ను స్థాపించారు. 1948–60 మధ్యకాలంలో ఇక్కడ నామ్ శపథ్ అనే ధ్యానం ఎలా చేయాలో మస్తానా బోధించారు. డీఎస్‌ఎస్ తర్వాతి అధినేత అయిన సత్నామ్‌సింగ్ డేరాను 1960 నుంచి 1990 మధ్య విస్తరించారు. 1990 ఏప్రిల్‌లో గుర్మీత్ అధిపతి అయ్యారు. డేరా వెబ్‌సైట్‌లో బాబా గుర్మీత్ పేరును సెయింట్ డాక్టర్ గుర్మీత్ రామ్‌రహీమ్‌సింగ్ ఇన్సాన్‌గా ప్రస్తావించడమేగాక ప్రపంచవ్యాప్తంగా ఆరు కోట్ల మంది అనుచరులున్నారని ప్రచారం జరుగుతోంది. జిల్లా ముఖ్య పట్టణమైన సిర్సాలో వెయ్యి ఎకరాలకు పైగా స్థలంలో విస్తరించి ఉందీ డీఎస్‌ఎస్ ప్రధానకేంద్రం. దీనిలో హొటెల్, సినిమాహాలు, క్రికెట్ మైదానం, క్రీడా గ్రామం, స్టూడియో, బయోగ్యాస్ ప్లాంట్ ఉన్నాయి. ముందస్తు అనుమతి లేకుండా బాబాను కలవడం అసాధ్యం. డేరా వెలుపల బాబా గుర్మీత్ అనుచరులు నడిపే 40 దుకాణాలున్నాయి.
ఆకర్షిస్తున్న డేరా కార్యక్రమాలు
దేశంలోనూ, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూఏఈ వంటి ఇతర దేశాల్లో కలిపి డీఎస్‌ఎస్‌కు 46 ఆశ్రమాలున్నాయి. డీఎస్‌ఎస్ చేపట్టే అనేక సేవా కార్యక్రమాలు లక్షలాది అనుచరులను ఆకట్టుకుంటున్నాయి. డేరా రెండో గురువు పేరిట సత్నామ్‌జీ గ్రీన్–ఎస్ వేల్ఫేర్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రకృతి వైపరీత్యాలు, భారీ ప్రమాదాల సమయంలో బాధితులకు సహాయం అందిస్తున్నారు. కోల్‌కతా అగ్నిప్రమాదం, జలంధర్ ఫ్యాక్టరీ ప్రమాదం, ఉత్తరాఖండ్ వరదల్లోనూ సంస్థ తరఫున వందలాది మంది వైద్యులు, వలంటీర్లు పనిచేశారు.
రాజకీయ క్రీ‘డేరా’!
దేశంలో స్వయం ప్రకటిత స్వామిజీలు, బాబాలు, గురువులతో అధికార యంత్రాంగం రాజకీయ నాయకుల బంధం విడదీయరానిదిగా మారుతోంది. ఇందుకు గుర్మీత్ సింగ్ మినహాయింపేం కాదు. ఇతనికి కేంద్రం, హరియాణా ప్రభుత్వాలు అత్యున్నత స్థాయి జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించడం, న్యాయస్థానం దోషి అని తేల్చాక కూడా ప్రధాన పార్టీల నేతలు స్పందించకపోవడాన్ని బట్టి డేరా హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
దళిత, బీసీల ఓట్ల కోసమే...
పంజాబ్, హరియాణా, రాజస్తాన్ రాష్ట్రాల్లో నిమ్న తరగతులకు చెందినవారు పెద్దసంఖ్యలో డేరా అనుచరులున్నారు. వారి ఓట్లను పొందేందుకే రాజకీయపార్టీలు డేరా మద్దతు కోసం పోటీపడుతున్నాయి. 2014లో బీజేపీకి మొదలైన డేరా మద్దతు లోక్‌సభ ఎన్నికలు, హరియాణా అసెంబ్లీ ఎన్నికల వరకు, ఆ తర్వాతా కొనసాగుతోంది. డేరా వర్గం ఓట్లు అటు కేంద్రంలో ఇటు హరియాణాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు తోడ్పడ్డాయి. 2014లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హరియాణాకు వచ్చిన నాటి ఎన్డీయే ప్రధాని అభ్యర్థి, నేటి ప్రధాని మోదీ సిర్సా బహిరంగసభలో, అంతకు పూర్వం పాల్గొన్న సభల్లోనూ, గుర్మీత్‌ను కీర్తించారు.
గతంలోనే అమిత్ షా, పంజాబ్ సీఎం అమరీందర్‌సింగ్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అనేక మంది నాయకులు డేరా కేంద్రాన్ని సందర్శించారు.గుర్మీత్‌ను దోషిగా తేల్చిన శుక్రవారానికి పదిరోజుల ముందు... ఆగస్టు 15న గుర్మీత్ పుట్టినరోజు కార్యక్రమానికి హరియాణా విద్యా శాఖ మంత్రి రాంవిలాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. డేరాలో క్రీడల ప్రోత్సాహం పేరుతో తన శాఖ నిధుల నుంచి మంత్రి రూ. 51 లక్షల విరాళాన్ని ప్రకటించారు. భారత యోగా ఫెడరేషన్ ఇటీవల క్రీడల్లో గురువులకిచ్చే ప్రతిష్టాత్మక ‘ద్రోణాచార్య’ అవార్డుకు డేరా చీఫ్ పేరును సిఫార్సు చేసింది. గుర్మీత్‌ది ‘గొప్ప ఆత్మ’ (నోబుల్ సోల్) అని శుక్రవారం బీజేపీ నేత సాక్షి మహారాజ్ కోర్టు నిర్ణయాన్ని తప్పుబట్టారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
గుర్మీత్ సింగ్‌పై కేసులు..
► తనతో విభేదించిన డేరా మేనేజర్ రంజిత్‌సింగ్ హత్యకు గుర్మీత్ రామ్‌రహీమ్‌సింగ్ 2002 జూలైలో కుట్ర పన్నారనే ఆరోపణలున్నాయి. డేరా ప్రధాన కేంద్రం సిర్సాలో సాధ్వీలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని రంజిత్‌సింగ్ ఆకాశరామన్న లేఖలు పంపిణీ చేశాడని అనుమానించారు.
► డేరా ప్రధాన కార్యాలయంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయంటూ వార్తా కథనాలు రాసిన సిర్సాకు చెందిన రాంచందర్ ఛత్రపతి అనే పాత్రికేయుడు 2002 అక్టోబర్ 23న హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో ప్రమేయముందంటూ గుర్మీత్‌తో సహా మరో ముగ్గురిపై కేసు నమోదైంది.
► 2014 డిసెంబర్ 23న డేరా ప్రధాన కేంద్రంలో గుర్మీత్ తన అనుయాయులైన 400 మంది వృషణాలను నొక్కేసి నిర్వీర్యులను చేశారన్న ఆరోపణలపై హైకోర్టు విచారణకు ఆదేశించింది.
► సిక్కుల మతగురువు గురు గోవింద్ సింగ్ మాదిరిగా గుర్మీత్ దుస్తులు ధరించారంటూ 2007లో భటిండా పోలీసులు కేసు నమోదు చేశారు.
► సిర్సాలో డేరా కార్యకర్తలకు ఆయు«ధ శిక్షణనిస్తున్నారంటూ భారత సైన్యం పేర్కొంది. ఆయుధ శిక్షణపై పరిశీలన జరిపి వివరాలు తెలియజేయాలంటూ హరియాణా ప్రభుత్వానికి హై కోర్టు నోటీసులిచ్చింది.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్