ఎవరీ గుర్మీత్?
ఎవరీ గుర్మీత్?
Published Sun, Aug 27 2017 2:27 AM | Last Updated on Sun, Sep 17 2017 5:59 PM
రాజస్తాన్‌లోని గంగానగర్ జిల్లాలోని శ్రీ గురుసార్ మోడియా గ్రామం గుర్మీత్ స్వస్థలం. జాట్ సిక్కు, సంపన్న రైతు మఘర్ సింగ్, నసీబ్ కౌర్‌ల ఏకైక సంతానం.1967 ఆగస్టు 15న గుర్మీత్ పుట్టారు. డేరా సచ్చా సౌదా మతగురువు షా సత్నామ్... గుర్మీత్‌ను ఏడేళ్ల వయసులోనే తనతో తీసుకెళ్లి సచ్చా సౌదాలో చేర్పించారు. పేరును గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌గా మార్చారు. గుర్మీత్‌కు 23 ఏళ్ల వయసు ఉన్నపుడు మత గురువు హోదాను ప్రసాదించి సెప్టెంబర్ 23, 1990లో తన వారసుడిగా ప్రకటించారు షా సత్నామ్. గుర్మీత్‌కు భార్య హర్‌జీత్ కౌర్, కొడుకు జస్మీత్, కూతుళ్లు చరణ్‌ప్రీత్, అమర్‌ప్రీత్ ఉన్నారు. హనీప్రీత్ అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. హనీప్రీత్ పంజాబీ సినీనటి, దర్శకురాలు. గుర్మీత్ సహా కుటుంబంలో అందరి పేరు చివరన ‘ఇన్సాన్ (మనిషి)’ అనే పదం ఉంటుంది.
సకల కళావల్లభుడు
గుర్మీత్ వేషధారణ రాక్‌స్టార్‌ను తలపిస్తుంది. జిగేల్‌మని మెరిసిపోయే ఆభరణాలు, వస్త్రధారణతో కనిపిస్తుంటారు. చలువ కళ్లజోడు, టీషర్టులు, రంగురంగుల చొక్కాలతో కనిపిస్తారు. ఆధ్యాత్మిక గురువు, దానశీలి, గాయకుడు, ఆల్‌రౌండర్ క్రీడాకారుడు, సినిమా దర్శకుడు, నటుడు, ఆర్ట్ డైరెక్టర్, సంగీత దర్శకుడు, రచయిత, గేయ రచయితగా ట్వీటర్ ప్రొఫైల్‌లో రాసుకున్న గుర్మీత్‌ను సకల కళావల్లభుడిగా చెప్పొచ్చు. ట్వీటర్‌లో ఆయనకు 37 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. స్వయంగా పాటలు రాసి, సంగీతం సమకూర్చి ఆల్బమ్స్ విడుదల చేస్తుంటారు. ఆధునిక సంగీతం ద్వారా ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తున్నానని చెప్పుకుంటారు. యూనివర్సల్ లేబుల్ కింద పాటల ఆల్బమ్స్‌ను విడుదల చేస్తుంటారు. 2014లో వచ్చిన హైవే లవ్ చార్జర్ ఆల్బమ్ మూడురోజుల్లోనే 30 లక్షల కాపీలు అమ్ముడైంది. సంగీత ప్రదర్శనలూ ఇస్తుంటారు. దేశంలోని వివిధ నగరాల్లో ఆయన ‘రు–బా–రు నైట్స్’ పేరిట వంద ప్రదర్శనలు ఇచ్చారు.
రచన– దర్శకత్వం– స్క్రీన్ ప్లే– మాటలు– పాటలు
సినిమాల్లోనూ గుర్మీత్‌కు ఆసక్తి మెండు. తన సినిమాల్లో తానే హీరో, తానే దర్శకుడు, కథ, మాటలు, పాటలు... ఇలా అన్నీ తానే. మెసెంజర్ ఆఫ్ గాడ్ (ఎంఎస్‌జీ) పేరిట రెండు సినిమాలను 2015లో తీశారు. దుష్టశక్తులు, గ్రహాంతరవాసుల నుంచి మానవాళిని కాపాడే గురూజీ పాత్రలో గుర్మీత్ నటించారు. ఖరీదైన స్పోర్ట్స్ బైకులను నడుపుతారు. తర్వాత ఎంఎస్‌జీ: ద వారియర్ లయన్‌హర్ట్, హింద్ కా నపాక్‌కో జవాబ్, జట్టూ ఇంజనీర్... అనే మూడు సినిమాలను తీశారు. దేశవ్యాప్తంగా వేలాది థియేటర్లలో ఈయన సినిమాలు విడుదలవుతుంటాయి. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈయన పేరుంది. ఎందుకో తెలుసా.. ఒక సినిమాలో అత్యధిక బాధ్యతలు నిర్వర్తించినందుకు. ఎంఎస్‌జీ–2 సినిమాకు గుర్మీత్ ఏకంగా 43 బాధ్యతలు నిర్వర్తించాడు.
అకల్‌తక్త్‌తో వివాదం
సిక్కుల పదో గురువు గురుగోవింద్ సింగ్‌ను పోలిన వస్త్రధారణ చేయడం ద్వారా సిక్కుల ఆగ్రహానికి గురయ్యారు గుర్మీత్. 2007లో జరిగిన ఈ సంఘటన సిక్కులకు, గుర్మీత్ అనుయాయులకు మధ్య ఉద్రిక్తతల కారణంగా ఘర్షణలు జరిగాయి. సిక్కుల మనోభావాలను దెబ్బతీశాడని కేసు నమోదైంది. మధ్యవర్తులు, ప్రభుత్వ పెద్దల జోక్యంతో గుర్మీత్ ఒకటికి రెండుసార్లు క్షమాపణ చెప్పినా సిక్కుల మత వ్యవహారాలకు సంబంధించి అత్యున్నత మండలి ‘అకల్‌తక్త్’ సంతృప్తి చెందలేదు. క్షమాపణ సరిగా కోరలేదని అభిప్రాయపడింది. 2015 సెప్టెంబర్ 27న క్షమాపణను అంగీకరించినా సిక్కుల వ్యతిరేకతతో మళ్లీ ఉపసంహరించుకుంది.
జడ్ ప్లస్ సెక్యూరిటీ
మనోభావాలను దెబ్బతీశాడని రగిలిపోయిన సిక్కు యువకులు 2007 జూలై 16న గుర్మీత్‌పై దాడి చేశారు. దీని నుంచి సురక్షితంగా బయటపడ్డారు. 2008లో ఆయన కాన్వాయ్‌పై బాంబుదాడి జరిగింది. ఇందులో గుర్మీత్‌కు ఏమీ కానప్పటికీ 11 మంది అనుయాయులు గాయపడ్డారు. దీంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు జడ్ ప్లస్ భద్రతను కల్పించింది. జడ్ ప్లస్‌లో 36 మంది సుశిక్షితులైన కమాండోలను భద్రత నిమిత్తం కేటాయిస్తారు.
విలాసవంతమైన జీవనశైలి
ఖరీదైన కార్లపై మోజు. బుల్లెట్ ప్రూఫ్ లెక్సస్, మెర్సిడెజ్ ఎస్‌యూవీల్లో తిరుగుతుంటారు. చిత్రమైన కార్లను డిజైన్ చేస్తుంటారు. ఎక్కడికి వెళ్లినా మందీమార్బలంతో తరలివెళతారు. చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్‌లో ప్రయాణం చేస్తారు. డేరా సచ్చా సౌదాకు దేశవ్యాప్తంగా 50 ప్రాంతాల్లో ఆశ్రమాలు ఉన్నాయి. డేరా ఆస్తులు కాకుండా గుర్మీత్ వ్యక్తిగత సంపద విలువ... 250 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Advertisement
Advertisement