7 కోట్ల మంది మత్తుకు దాసోహం
7 కోట్ల మంది మత్తుకు దాసోహం
Published Tue, Mar 14 2017 4:18 PM | Last Updated on Fri, May 25 2018 2:29 PM
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సుమారు 7.32 కోట్ల మంది మాదక ద్రవ్యాలు, మద్యం మత్తుకు బానిసలుగా మారారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2000-01 కాలంలో చేపట్టిన సర్వే వివరాలను మంగళవారం లోక్‌సభకు వెల్లడించింది. హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్ ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ సర్వే ప్రకారం దేశంలో మద‍్యపానం 6.25 కోట్ల మంది, గంజాయి 87 లక్షల మంది, నల్లమందు సేవనం 20 లక్షల మంది వ‍్యసనంగా మార్చుకున్నట్లు తేలిందన్నారు. ఈ విషయంలో 2001 తర్వాత మరో సర్వే చేపట్టలేదని తెలిపారు. అయితే, దేశంలో మత్తు పదార్థాల ప్రభావానికి లోనయ్యే వారి సంఖ్య రాన్రానూ ఎక్కువవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 2016లో దేశ వ్యాప్తంగా చేపట్టిన సోదాల్లో 46,873 కిలోల మెథాక్వలోన్ అనే మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ దాడుల్లో 8 మంది విదేశీయులతోపాటు 20 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
Advertisement