వివేకం: పూర్తి ఉత్తేజం కావాలా?
మన ప్రతి అనుభవం వెనుకా ఓ రసాయనిక మూలం ఉంటుంది. తమ శారీరక అనుభవాన్ని మనోహరం చేసుకునేందుకు జనం మాదక ద్రవ్యాల రూపంలోనో, మత్తు పానీయాల రూపంలోనో రసాయనాలను ఉపయోగించడానికి ప్రయత్నిస్తారు. మీరు కొద్దిపాటి ఆనందాన్ని మాత్రమే ఆశిస్తుంటే, నేను అందుకు వ్యతిరేకమేమీ కాదు. కానీ, మీరు కేవలం ఆనందమే కావాలనుకునేవారైతే, ఇంతకన్నా పెద్ద ఆనందాన్ని, పరమానందాన్ని అందిపుచ్చుకునే అవకాశాన్ని మీరు కాదనగలరా? మీరు సర్వకాల సర్వావస్థల్లోనూ తాగి, చురుకుగా, అప్రమత్తంగా ఉండటం నేర్చుకోవడానికి మీరు ఉత్సాహంగా లేరా?
జనం ఆల్కహాల్ కోసమే తపించిపోవడానికి కారణమేమిటంటే, వాళ్లకు తెలిసిన అతి గాఢమైనది అదే గనుక. నేను వారికి ఆల్కహాల్ కన్నా ఎక్కువ మత్తు ఇచ్చే వేరే రకమైన పానీయం ఇస్తున్నాను. ఆల్కహాల్‌ను నేను పక్కన పెట్టేస్తున్నది దేనికంటే, నాకు ఇందులో కావలసినంత మత్తు లేదనిపిస్తోంది. నేను వేరే మరోదాన్ని సేవిస్తూ ఉంటాను. జీవితాన్ని ఆస్వాదిస్తాను. నాతో దీన్ని రుచి చూసినవారు ఆల్కహాల్‌కు స్వస్తి చెప్పారు.
వాళ్లు దీన్ని వదిలేసింది ఇదేదో చెడు అలవాటని కాదు; ఇది చిన్నపిల్లల వ్యవహారమని వాళ్లు మానేశారు. వాళ్లు ఈ స్థాయిని మించి ఎదిగారు. ఆల్కహాల్ మంచిదా, కాదా అన్నది కాదు ప్రశ్న. రాత్రి కొద్దిగా తాగితే, ఉదయమయ్యే సరికి మీకు తలనొప్పి పట్టుకుంటుంది. కానీ, నేను రోజంతా తాగి ఉండగలను. అయినా నాకు తలనొప్పి రాదు. పైగా నాకేమీ ఖర్చు కాదు కూడా. ఇంకా చెప్పాలంటే, ఆరోగ్యానికి మంచిది కూడా. మరి తాగడంలో ఇదే ఉత్తమమైన తాగుడు కాదా? మాకు మద్యపానం సేవించడం, మాదక ద్రవ్యాలు తీసుకోవడం వగైరాలన్నీ చిన్నపిల్లల వ్యవహారంగా కనిపిస్తుంది. ఎందుకంటే, మేము సచేతనంగానే ఉండి, ఇంతకన్నా వెయ్యి రెట్లు ఎక్కువగా మత్తుగా ఉండగలం. మీరు డి-వైన్‌ను తాగగలిగినప్పుడు వైన్ ఎందుకు?
మరొక విధంగా చెప్పాలంటే, మీరు ఆల్కహాల్ లేదా మాదక ద్రవ్యాల ద్వారా పొందే శాంతి, ఆనందం అంతా మీలోనే అనుభవిస్తున్నారు. ఇవన్నీ మీలో అంతర్గతంగా జరిగే రసాయనిక ప్రక్రియల వలనే కలుగుతున్నాయి. ఆల్కహాలు, మాదక ద్రవ్యాలు లేదా మరే ఇతర బయటి పదార్థాలను తీసుకోవాల్సిన అవసరం లేకుండానే మీలో పరమానందాన్ని కలిగించే రసాయనిక ప్రక్రియలను కలిగించడమే ఆధ్యాత్మిక ప్రక్రియలన్నిటి ఉద్దేశం. ఇక మీరు పూర్తి శాంతిమయులవడానికి, పరమానందభరితులవడానికి వైన్ మీద ఆధారపడతారా లేక డి-వైన్ మీద ఆధారపడతారా? అన్నది మీరే నిర్ణయించుకోండి.
సమస్య - పరిష్కారం
మద్యం తీసుకుంటే కలవరం తగ్గి, బాధలన్నీ మరిచి, హాయిగా నిద్రపోతున్నాను. రోజూ కాస్త మద్యం తీసుకుంటే గుండెకు సంబంధించిన వ్యాధులు రావని డాక్టర్లు చెప్పినట్లు చదివాను. ఇది నిజమేనా?
- టి.రాజశేఖర్, కాకినాడ
సద్గురు: ప్రతిదినం ఒక ఆపిల్ తినడం మంచిది అంటారు. ఇప్పుడు దాన్ని మద్యం అంటూ మార్చేశారా? వాస్తవంగా, మద్యం తీసుకుంటే ఏం జరుగుతుంది? మీలో ఒక రసాయన ప్రక్రియ జరిగి, కలవరాన్ని తగ్గిస్తుంది. అదే ప్రశాంతత అని అనుకుంటున్నారు. ఒక పెగ్ విస్కీ తాగితేనే ఇంత హాయిగా ఉంటే, ఒక సీసా విస్కీ తాగితే ఎన్నో రెట్లు హాయిగా ఉండాలి కదా? తాగి చూడండి. ఏమవుతుంది? మామూలు సమయాల్లో శాంతంగా, హుందాగా ఉండే ఎంతోమంది మద్యం పుచ్చుకోగానే చేసే హడావిడి మీరు చూడటం లేదా? మద్యం తీసుకుని మతి కోల్పోయి చేసిన నేరాల గురించి, జైలుశిక్ష అనుభవించినవారిని అడగండి చెప్తారు.
మీ జీవితంతో మీకు అవసరం ఉన్నందుకే కదా జీవించాలనుకుంటున్నారు. జీవించడాన్ని శక్తిమంతం చేయాలంటే, మెదడుకు పదును పెట్టాలి కదా! మద్యం లాంటి ఏ మత్తు పదార్థమైనా, మీ మెదడును మెరుగు పరుస్తుందా? లేక మందగించేలా చేస్తుందా? మద్యం మిమ్మల్ని శాంత పర్చడం లేదు. మొద్దు బారుస్తున్నది. మీరు జీవించాలని ఆశ పడుతున్నారా? స్పృహ తప్పి పడిపోవాలనుకుంటున్నారా? ఆలోచించండి! మద్యపానం మీకు మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? మీరే గమనించండి.
- జగ్గీ వాసుదేవ్