శ్రీనగర్/న్యూఢిల్లీ: కశ్మీర్‌లో భద్రతాబలగాలు లక్ష్యంగా ఉగ్రవాదులు సోమవారం గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 8 మంది భద్రతా సిబ్బందితో పాటు 15 మంది పౌరులు గాయపడ్డారు. షోపియాన్ జిల్లాలో రద్దీగా ఉన్న మార్కెట్ సమీపంలో ఉన్న భదత్రాబలగాలపై ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరి పరారయ్యారు. దీంతో నలుగురు పోలీసులు సహా 16 మందికి గాయాలయ్యాయి.
పుల్వామా జిల్లాలోని తలాబ్ చౌక్‌లో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలపై జరిగిన గ్రెనేడ్ దాడిలో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు ముగ్గురు పౌరులు గాయపడ్డారు. గురువారం నుంచి ఇప్పటిదాకా భద్రతా బలగాలపై డజనుకుపైగా గ్రెనేడ్ దాడులు జరిగాయి. కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంట శాంతిని నెలకొల్పేందుకు సోమవారం జరిగిన ఫ్లాగ్‌మీటింగ్‌లో భారత్, పాకిస్తాన్‌లు అంగీకరించాయి.
బీఎస్‌ఎఫ్ డీఐజీ ధిమన్, పాక్ బ్రిగేడియర్ హుస్సేన్‌ల నేతృత్వంలో ఇరుదేశాల అధికారులు పాక్‌లోని అక్ట్రాయ్ ఔట్‌పోస్ట్‌లో సమావేశమై చర్చలు జరిపారు. జూన్ 21న మరోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment