ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలన్న ప్రతిపాదనకు లా కమిషన్ గ్రీన్‌సిగ్నల్ లభించిన నేపథ్యంలో జమిలి ఎన్నికలపై నిర్వహించిన సర్వేలో ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమైంది. లోకల్‌సర్కిల్స్ అనే సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో 84 శాతం మంది జమిలి ఎన్నికలకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే జమిలి ఎన్నికలపై ఈ సందర్భంగా పలు సందేహాలను వారు వ్యక్తపరచడం గమనార్హం. జమిలి ఎన్నికలను సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 13 శాతం మంది వ్యతిరేకించారని లోకల్‌సర్కిల్స్ పేర్కొంది.
జమిలి ఎన్నికలతో సమయం, ఖర్చు ఆదా అవడంతో పాటు అభివృద్ధి, పాలనపై ప్రభుత్వాలు దృష్టిసారించేందుకు వెసులుబాటు ఉంటుందని సర్వేలో పాల్గొన్నవారిలో 93 శాతం మంది అభిప్రాయపడ్డారని తెలిపింది. అయితే పటిష్ట ప్రచార నైపుణ్యాలు కలిగిన పార్టీ దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అధికార కేంద్రీకరణకు దారితీయడంతో పాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పదవీకాలాన్ని కుదించివేస్తుందని సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. కాగా, 2019 నుంచి రెండు దశల్లో జమిలి ఎన్నికలను నిర్వహించవచ్చని లా కమిషన్ సానుకూలత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. లా కమిషన్ వెల్లడించిన కార్యనిర్వాహక పత్రం ప్రకారం మలివిడత జమిలి ఎన్నికలు 2024లో నిర్వహించవచ్చని పేర్కొంది. అయితే దీనికి అనుగుణంగా రాజ్యాంగంలో కనీసం రెండు నిబంధనలను సవరించాల్సి ఉంటుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment