వణుకు పుట్టించిన పేలుడు
చెన్నై సమీపం పెరంబలూరులో గురువారం రాత్రి బస్సులో సంభవించిన పేలుడు పోలీసు అధికారుల వెన్నులో వణుకు పుట్టించింది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగకున్నా పెట్రో బాంబు పేలుడు ధాటికి 9 మంది గాయపడ్డారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: తీవ్రవాదులు ఎంతకైనా తెగబడవచ్చు తస్మాత్ జాగ్రత్త అంటూ కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు రాష్ట్ర పోలీస్ యంత్రాగాన్ని నెల క్రితమే అప్రమత్తం చేశారు. పంద్రాగస్టు సమీపించే కొద్దీ పోలీసు తనిఖీలు పెరిగిపోయాయి. చీమచిటుక్కుమన్నా అనుమానించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలను తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తెల్లారితే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అనగా బస్సులో పెట్రో బాంబు పేలుడుతో అధికారులు బెంబేలెత్తిపోయారు.
చెన్నై శివారులోని పెరంబలూరు నుంచి దురైయూరుకు గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో 60 మంది ప్రయాణికులతో ఒక ప్రైవేటు బస్సు బయలుదేరింది. మావిలంగు ప్రాంతానికి చెందిన చంద్రన్ (28) బస్సును నడుపుతుండగా కురుంబలూరుకు చెందిన రాజేష్ డ్రైవర్ విధులను నిర్వర్తిస్తున్నాడు. రాత్రి 8.15 గంటల సమయంలో బస్సు ఈచ్చంపట్టి లాడపురం ప్రాంతంలో వెళుతుండగా డ్రైవరు సీటుకు వెనుక నాలుగో వరుసలోని ప్రయాణికుల సీట్ల కింద నుంచి అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. దీంతో డ్రైవరు బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులు భయంతో కేకలు వే స్తూ కిందకు దూకేశారు.
సీటు కింద భాగంలో కాలిన గుర్తులతో పేలుడు జరిగి ఉండటాన్ని గుర్తించారు. ఈ పేలుడులో ప్రయాణికులు రామాయి, రాజేశ్వరి, విజయరాఘవన్, చిన్నదురై, కలియపెరుమాళ్, నాగలాపురం సెల్వరాజ్, నక్కసేలం లోకనాథన్, దినేష్, సతీష్‌కుమార్ గాయపడ్డారు. క్షతగాత్రులను పెరంబలూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. పేలుడు జరిగిన చోట దొరికిన ఆనవాళ్లను బట్టీ పెట్రో బాంబుగా నిర్ధారించారు.
అనేక వైర్లతో ఛిద్రమై ఉన్న ప్లాస్టిక్ పెట్టె, బ్యాటరీ, బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈచ్చంపట్టిలో నలుగురు వ్యక్తులు బస్సులో ఎక్కారని కండక్టర్ చెప్పాడు. వారంతా ఆపెట్టెను వదిలి మార్గమధ్యంలో దిగిపోయినట్లు తెలుసుకున్నారు. ఇదే బస్సులో పేలుళ్లు జరపాలని దుండగులు భావించారా లేక మరేదైనా పెద్ద లక్ష్యమా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. తెల్లారితే వేడుకలు ప్రారంభం అవుతుండగా ముందురోజు రాత్రి జరిగిన ఈ సంఘటన అధికారులను కలవరపాటుకు గురిచేసింది.