హైదరాబాద్: అప్పుడు బెంగళూరు....ఇప్పుడు హైదరాబాద్. భాగ్యనగరం మరోసారి గుండెమార్పిడికి వేదికైంద. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలోని ఓ మహిళకు అమర్చాల్సిన గుండెను బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో నగరానికి తీసుకు వచ్చారు. శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షణలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంది.
అక్కడి నుంచి అంబులెన్సులో నేరుగా ఆస్పత్రికి గుండెను చేర్చారు. ఇందుకోసం ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ యంత్రాంగం చర్యలు తీసుకుంది . కేవలం మూడే మూడు నిమిషాల్లో బేగంపేట విమానాశ్రయం నుంచి శర వేగంగా సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన 45 ఏళ్ల పద్మకు ఈ గుండెను అమర్చనున్నారు. డాక్టర్ గోఖలే బృందం ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరగనుంది.
షోలాపూర్ కు చెందిన రోజువారి కూలి చేసుకునే వ్యక్తి రెండు రోజుల క్రితం కర్ణాటకలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దాంతో అతన్ని చికిత్స నిమిత్తం పీఎంఎస్ఎస్వై ఆస్పత్రిలో చేర్చారు. అయితే రోగికి బ్రెయిన్ డెడ్ అయినట్టుగా వైద్యులు ప్రకటించారు. దీనితో మృతుని బంధువులు అవయవదానానికి అంగీకరించారు. హైదరాబాద్ లో గుండె మార్పిడి జరిగింది. అప్పట్లో అపోలో ఆస్పత్రిలో గుండె మార్పిడి జరిగింది. మరోవైపు మృతుని కాలేయం, రెండు మూత్ర పిండాలు హైదరాబాద్ లోని మరో ముగ్గురు రోగులకు అమర్చనున్నారు.