టెకీపై అత్యాచారం.. ఆపై వికృత చేష్టలు!
బెంగళూరులో ఐటీ ఇంజినీరు అరెస్టు
సాక్షి, బెంగళూరు : మహిళా టెకీపై లైంగికదాడికి పాల్పడి ఆ దృశ్యాలను అశ్లీల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన సహచర ఐటీ ఇంజినీరును బెంగళూరు వివేకనగర పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. అరింధమ్‌నాథ్ (28) అనే యువకుడు నగరంలోని ఒక సంస్థలో ఐటీ ఇంజినీరు. ఇదే కంపెనీలో పనిచేసే యువతిని ప్రేమించాలని ఇతడు ఒత్తిడి చేయగా, ఆమె నిరాకరించింది. గత ఏడాది ఒకరోజు తన ఇంటికి రావాలని అరింధమ్‌నాథ్ యువతిని కోరగా, ఆమె తన స్నేహితురాలిని వెంట తీసుకుని అతడి ఇంటికి వెళ్లింది.
ఈ సమయంలో అరింధమ్‌నాథ్, ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఆ దృశ్యాలను రహస్యంగా మొబైల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. కొంతకాలానికి ఆమె వేరే కంపెనీలో చేరింది. కానీ కామాంధుడు ఆమెకు పదేపదే ఫోన్ చేసి తన ఇంటికి రావాలని వేధించడంతో పాటు అడిగినంత డబ్బు ఇవ్వాలని, లేని పక్షంలో రేప్ దృశ్యాలను ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరింపులకు దిగాడు. దీనికి ఆమె నిరాకరించగా, ఈ నెల 4 తేదీన లైంగికదాడి దృశ్యాలను ఒక నీలిచిత్రాల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి, ఆ లింక్‌ను బాధితురాలికి పంపించి వికృత చేష్టలకు పాల్పడ్డాడు.
దీంతో భయాందోళనకు గురైన బాధితురాలు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, స్నేహితురాలు గమనించి ఆమెను కాపాడింది. ఈ నెల 6వ తేదీన వివేకనగర పీఎస్‌లో నిందితుడిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం అతణ్ని అరెస్ట్ చేశారు. అత్యాచారం, బెదిరింపులు, ఐటీ చట్టం తదితర సెక‌్షన్ల కింద అరింధమ్ నాథ్‌పై కేసులు నమోదు చేశారు.