సాక్షి, కోలారు: బెంగళూరు రూరల్‌లోని బాగలూరులో నివాసం ఉండే టెక్కీ రాహుల్(27) తన మూడేళ్ల వయసున్న కుమార్తెతో కలిసి ఈనె 16న కోలారులోని కెందెట్టి చెరువులో దూకాడన్న మిస్టరీ వీడింది. కుమార్తెను నీటిలోకి తోసి హత్య చేసి అనంతరం ఆచూకీ లేకుండా పోయిన టెక్కీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గుజరాత్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాహుల్.. భవ్య అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి జియా అనే కూతురు ఉంది.
ఏడాదిన్నర క్రితం ఉద్యోగం కోల్పోయిన రాహుల్ బిట్ కాయిన్‌లో డబ్బు పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. ఖర్చుల కోసం విపరీతంగా అప్పులు చేయడంతో అప్పులబాధ ఎక్కువైంది. గతంలో ఇంట్లో బంగారం చోరీ అయిందని తప్పుడు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు విచారణకు హాజరు కావాలని తెలపడంతో రాహుల్ భయపడ్డాడు.
ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం
కూతురిని స్కూల్‌కు వదలి రావడానికి కారులో బయలుదేరిన సమయంలోనే అప్పుల వారు ఇంటి వద్దకు వచ్చి వేధించడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాను చనిపోతే భార్య కూతురును సరిగా చూడదని భావించి కూతురుతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నవంబర్ 15వ తేదీన కూతురిని స్కూల్‌కు వదిలి వస్తానని కారులో బయలుదేరి నేరుగా కోలారు జాతీయ రహదారి పక్కనే ఉన్న కెందట్టి చెరువు వద్దకు వచ్చాడు.
చదవండి: (మహా నగరంలో మాయగాడు.. సివిల్ సప్లయీస్ డెప్యూటీ కలెక్టర్‌నంటూ..)
కూతురిని కారులోనే ఊపిరాడకుండా చేసి చంపి మృతదేహాన్ని చెరువులో పారవేశాడు. అనంతరం తాను కూడా చెరువులోకి దూకాడు. అయితే లోతు తక్కువగా ఉండడం వల్ల బతికి పోయాడు. ఎలాగైనా చనిపోవాలని భావించిన రాహుల్ రైలు కిందపడేందుకు బంగారుపేట రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. రైలు కింద దూకడానికి భయపడి పలు ప్రాంతాల్లో రైలులోనే తిరిగి చివరికి చెన్నై చేరుకున్నాడు.
చెన్నైలో తన సంబందీకులకు ఫోన్ చేసి తనను ఎవరో కిడ్నాప్ చేశారని నాటకం ఆడాడు. మొబైల్ నెట్‌వర్క్ ఆధారంగా రాహుల్ ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరుకు రైలులో వస్తున్నాడని తెలుసుకుని గురువారం రాత్రి పోలీసులు అతనిని అరెస్టు చేశారు. పోలీసు విచారణలో రాహుల్ అన్ని విషయాలు బయటపెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment