నెహ్రూనగర్ (గుంటూరు): దేశంలో ఇప్పుడు ప్రభుత్వ/ప్రైవేటు రంగాలకు సంబంధించి ఏ సర్వీసు పొందాలన్నా ఆధార్ తప్పనిసరి. మొబైల్ సిమ్ కార్డు నుంచి పాన్‌కార్డు వరకూ ఈ ఆధార్ ఆధారమైంది. ఈ కార్డులో పౌరుని వ్యక్తిగత సమాచారం మొత్తం నిక్షిప్తమై ఉంటుంది. మన వ్యక్తిగత రుజువుకు ఆధార్ మించింది లేదు. దీంతో మనం కూడా ప్రతీదానికి ఆధార్‌నే ఇస్తున్నాం. ఇందులో మన కంటిపాప, వేలిముద్రలు, చిరునామా వంటి వివరాలన్ని నిక్షిప్తమై ఉంటాయి. మీ ఆధార్ దుర్వినియోగం అవుతున్నట్లు అనుమానంగా ఉందా...? అయితే మీ ఆధార్ ఎప్పుడు ఎక్కడ ఎలా వాడారో తెలుసుకునే అవకాశం ఆధార్ కార్డు జారీ చేసే సంస్థ కల్పించింది. ఈ సమాచారం మీ కోసం.
ఆధార్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా...
మీ ఆధార్ ఎలా ఎక్కడ వినియోగించారో తెలుసుకునేందుకు ఆధార్ అధికారిక వెబ్‌సైట్ https://resident.uidai.gov.in/ లాగిన్ అవ్వాలి. కనిపించే ముఖచిత్రంలో ఆధార్ సర్వీసెస్ అని కుడివైపు ఓ కాలం కనిపిస్తుంది. ఆ కాలం కింది భాగంలో ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అని ఓ ట్యాగ్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే, మరో విండో ఓపెన్ అవుతుంది. అక్కడ కనిపించే పేజీలో మీ యూఐడీ నంబరు, క్యాప్చ కోడ్ నమోదు చేయాలి. జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే.. మీ రిజిస్టర్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత పేజీలో మీకు ఎటువంటి సమాచారం కావాలో మీకు కొన్ని ఆప్షన్స్ డిస్‌ప్లే అవుతాయి. బయోమెట్రిక్ డెమోగ్రాఫిక్ లాంటివి, ప్రస్తుత తేదీ నుంచి గరిష్టంగా ఆరు నెలల కిందట వరకు మీరు ఆధార్‌ను ఎలా ఎక్కడ వాడారో తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆప్షన్స్ ఎంటర్ చేయాలి.. లేకుంటే మీకు ఎర్రర్ చూపించే అవకాశం ఉంది. అక్కడ వివరాలు నమోదు చేశాక చివరి కాలంలో ఓటీపీ ఎంటర్ చేసి సబ్‌మిట్ చేస్తే మొత్తం వివరాలు వస్తాయి. మీరు ఏ రోజు, ఏ సమయానికి, ఎలాంటి పనికోసం మీ ఆధార్‌ను ఇచ్చారనే వివరాలు కనిపిస్తాయి. ఆధార్ వాడిన కంపెనీ లేదా ఏజెన్సీ పేర్లు మాత్రం చూపించదు. దానికి సంబంధించిన వివరాలు మాత్రమే చూపిస్తుంది.
అనుమానం వస్తే లాక్ చేసుకోవచ్చు
మీ ఆధార్ ఎక్కడో తప్పుగా వాడుతున్నారన్న అనుమానం వస్తే లాక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా అనుమానం వస్తే మీ ఆధార్, వివరాలు మీరు అనుమతిస్తేనే అవతలి వాళ్లు వాడుకునేలా చేయవచ్చు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో ఆధార్ అధికారిక వైబ్‌సైట్‌లో ఆధార్ వివరాలు లాక్ చేయవచ్చు. ఏదైనా ఏజెన్సీ/సంస్థ ఆ వివరాలను తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు అన్‌లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment