
న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన ఆధార్ చట్ట సవరణల ప్రతిపాదనల ప్రకారం విశిష్ట గుర్తింపు సంఖ్యల ప్రాధికార సంస్థ యూఐడీఏఐకి మరిన్ని అధికారాలు లభించనున్నాయి. ఒక రకంగా నియంత్రణ సంస్థ పాత్ర పోషించనుంది. బయోమెట్రిక్ ఐడీ దుర్వినియోగం చేసే వారిపైనా, నిబంధనలు ఉల్లంఘించేవారిపైనా భారీగా జరిమానాలు విధించేందుకు కూడా దీనికి అధికారాలు దఖలుపడనున్నాయి. సవరణ ప్రతిపాదనల ప్రకారం.. ఆధార్ డేటాబేస్‌లోకి అనధికారికంగా చొరబడిన పక్షంలో 10 ఏళ్ల దాకా కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది మూడేళ్లుగా మాత్రమే ఉంది.
మరోవైపు, బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు, మొబైల్ ఫోన్ సిమ్ కార్డులు తీసుకునేందుకు కస్టమర్లు స్వచ్ఛందంగా తమ ఆధార్‌ను ఇవ్వొచ్చు. ప్రతిపాదిత సవరణలను ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో కేంద్రం పార్లమెంటు ముందు ఉంచనుంది. ప్రైవేట్ సంస్థలు ఆధార్ డేటాను వినియోగించుకోవడంపై ఆంక్షలు విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో కేంద్రం తాజా సవరణలు ప్రతిపాదించింది. శ్రీకృష్ణ కమిటీ సిఫార్సుల ప్రకారం వీటిని రూపొందించింది.
Comments
Please login to add a commentAdd a comment