ప్రభుత్వ ఏర్పాటుపై 23న నిర్ణయం : ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచే యడంపై నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రజాభీష్టానికి వదిలింది. ప్రజలు కోరితే ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని ఆ పార్టీ అంటోంది. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుచేయాలా, వద్దా అన్న విషయంపై ఈనెల 22 వరకు ప్రజాభిప్రాయాన్ని సేకరించి 23న నిర్ణయం తీసుకుంటామని, అదేరోజు లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు తెలియజేస్తామని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. మంగళవారమిక్కడ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీతో, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో విడిగా సమావేశం నిర్వహించిన తరువాత కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుచేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్నారు.
ప్రభుత్వ ఏర్పాటుపై ప్రజాభిప్రాయం సేకరించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఆప్ ప్రజలకు లేఖ రాసిందని, 25 లక్షల లేఖ ప్రతులను ఢిల్లీ అంతటా పంచి ప్రజాభిప్రాయాన్ని కోరతామని చెప్పారు. ప్రజలు తమ అభిప్రాయాన్ని ఎస్‌ఎంఎస్ ద్వారా లేదా ఆప్ వెబ్‌సైట్, ఫేస్‌బుక్ ద్వారా తమకు తెలియచేయాలని ఆయన కోరారు. దానితోపాటు ఢిల్లీలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసభలను నిర్వహించి ప్రజాభిప్రాయం తీసుకుంటామని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ ముందుకురాకపోవడంతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ రాష్ర్టపతి పాలనకు సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోకుండా ఆప్ సస్పెన్స్ కొనసాగించడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. ఆప్‌కు ఓటేయడమంటే అనిశ్చితికి ఓటేసినట్లేనని ప్రజలు భావిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పీసీ చాకో పేర్కొన్నారు.
నా పేరిట ట్విట్టర్‌లో నకిలీ ఖాతా
తన ట్విట్టర్ ఖాతాను పోలిన నకిలీ ఖాతాను ఎవరో సృష్టించి, అందులో అన్నాహజారేను విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారంటూ కేజ్రీవాల్ మంగళవారం ఢిల్లీలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.